Munugode | మునుగోడు, జూలై 9 : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల నియోజకవర్గంలోని మండలాలకు కొత్త అధ్యక్షుల నియామకం జరిగింది. దీంతో ఒక వర్గం నేతలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చల్లమళ్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి వర్గాల మధ్య రెండు రోజులుగా ఒక వర్గంపై మరో వర్గం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మండల కేంద్రంలో పాల్వాయి స్రవంతి అనుచరుడు పున్న కైలాస్నేత ఆధ్వర్యంలో చల్లమళ్ల కృష్ణారెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేస్తున్న సమయంలో చల్లమళ్ల కృష్ణారెడ్డి అనుచరులు వచ్చి అడ్డుకున్నారు.
దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కమిటీల లొల్లి నియోజకవర్గంలో మరింత తారాస్థాయికి చేరుకున్నది. చల్లమళ్ల, పాల్వాయి వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. దీంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.