నల్లగొండ, అక్టోబర్ 09 : ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండలో ఆయన మాట్లాడుతూ.. ఐదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా అని ఆయన ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ నాయకులతో కలిసి ఢిల్లీ వేదికగా కోట్లాట పెట్టండన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలు అయినట్లు తెలిపారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారే తప్పా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ధి ప్రదర్శించ లేదని దుయ్యబట్టారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించినట్లు తెలిపారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీఓ ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపాలన్నారు. రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలన్నారు. పార్లమెంట్లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేసి, ఢిల్లీ వేదికగా యుద్ధ భేరి మోగించాలన్నారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుందని, ఢిల్లీని నిలదీస్తుందని ఆయన పేర్కొన్నారు.