భువనగిరి అర్బన్, జనవరి 23 : భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ను బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. లోపాయికారి ఒప్పందంతో రెండు కలిసికట్టుగా ఉండి చైర్మన్, వైస్ చైర్మన్‌ను పడగొట్టాయి. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఆర్డీఓ అమరేందర్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి 31 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాసానికి చేతులు ఎత్తి ఓటు వేశారు. దాంతో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య తమ పదవులను కోల్పోగా కౌన్సిలర్లుగా కొనసాగనున్నారు. ఈ అవిశ్వాసానికి చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు 5వ వార్డు కౌన్సిలర్ ఏవీ కిరణ్‌కుమార్, 17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి హాజరు కాలేదు.
35 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్
భువనగిరి మున్సిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లు, ఒకరు ఎక్స్ అఫీషియో మెంబర్ (ఎమ్మెల్యే) ఉన్నారు. రాయగిరి చెందిన మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్‌గా చింతల కిష్టయ్యను ఎన్నుకోగా నాలుగు సంవత్సరాల నుంచి పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 30న బీఆర్ఎస్ కౌన్సిలర్లు 16 మంది, కాంగ్రెస్ కౌన్సిలర్లు 9 మంది, బీజేపీ కౌన్సిలర్లు ఆరుగురు కలిసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. దాంతో కలెక్టర్‌కు జనవరి 23న అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాలని ఆర్డీఓ అమరేందర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీని కోసం హాజరైన 31 మంది సభ్యులు మొత్తం అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయడంతో నెగ్గింది.
క్యాంపులకు కౌన్సిలర్లు
భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం ఏర్పాటు చేయాలని కోరుతూ డిసెంబర్ 30న కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన అనంతరం 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు. మంగళవారం పెట్టిన అవిశ్వాస్వానికి వారు నేరుగా క్యాంపు నుంచి హాజరయ్యారు. అవిశ్వాసం నెగ్గిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి 30వ వార్డు కౌన్సిలర్ ఎండీ అజిమోద్దీన్ సమక్షంలో కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అవకాశం వస్తే చేజిక్కించుకోవాలని వారి వ్యుహంతో ముందుకెళ్తున్నారు. 35 మంది కౌన్సిలర్లలో 20 మంది బీఆర్ఎస్, 9 మంది కాంగ్రెస్, ఆరుగురు బీజేపీ సభ్యులు ఉన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకే అవకాశం ఉండడంతో చైర్మన్ పదవి దక్కించుకోవడానికి 30వ వార్డు కౌన్సిలర్ ఎండీ అజిమొద్దీన్ పావులు కదుపుతున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తేదీ వచ్చే వరకు క్యాంపులు కొనసాగనున్నట్లు తెలుస్తున్నది.