– ఫొన్ ట్యాపింగ్‌లో ఫిర్యాదుదారులు లేరు, నష్టపోయిన వారు లేరు
– ఇది కేవలం రేవంత్ రాక్షసానందానికి నిదర్శనం
– సూర్యాపేట మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, జనవరి 31 : ఫోన్ ట్యాపింగ్‌లో ఫిర్యాదుదారులు లేరు, నష్టపోయిన వారు లేరు, ఎఫ్ఐఆర్ లేకుండానే విచారణ పేరుతో పనికి మాలిన చర్యకు ప్రభుత్వం పాల్పడుతుందని, కాంగ్రెస్, బీజేపీ ఏకమై కేసీఆర్‌పై విషం కక్కుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్కుఉ సిట్ నోటీసుల విషయంలో కాంగ్రెస్ డ్రామాలను ఎండగడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు నోటీసులివ్వడమంటే కాంగ్రెస్ దివాళా కోరుతనానికి, రేవంత్ రాక్షసానందానికి నిదర్శనం అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇటువంటి ఆరోపణలు వారికీ సహజమే అన్నారు. కాంగ్రెస్ లో మంత్రులు, వారి కుటుంబ సభ్యుల ఆరోపణలను కప్పి పూచేందుకే ఈ విచారణ డ్రామాలు. బెదిరింపులు, రాసలీలలు అంటూ ఒకరిమీద ఒకరి ఆరోపణలు నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఇది నిజంగా స్కీముల ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం అన్నారు. వాళ్ల తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇటువంటి నోటీసులు అన్నారు. కేటీఆర్, హరీష్, సంతోష్, ఇప్పుడు కేసీఆర్‌పై విచారణ అంటూ హడావుడి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మంత్రి గాంధీభవన్ సాక్షిగా ఆపార్టీ నేతలపై చేసిన ఆరోపణలు నిజం కాదా అని ప్రశ్నించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నోటీసులు సరికాదని, అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసినట్లే మాట్లాడుతున్నరన్నారు. ఆత్మాభిమానం చంపుకుని కొంతమంది అధికారులు పనిచేస్తున్నారని, 65 ఏండ్లు దాటితే వారు కోరిన చోటుకే వెళ్లి విచారించాలని చట్టం స్పష్టంగా చెబుతుందన్నారు. కేసీఆర్ నివాసం ఎర్రవల్లి అనేది అందరికీ తెలిసిందేనన్నారు. డీజీపీ, సీపీ, సిట్ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్‌కు నోటీసులు ఎప్పుడివ్వాలనేది అధికారులకు తెలువదా అని ఆయన ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతుందన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల అభివృద్ధిని, కాంగ్రెస్ రెండేళ్లలో ఆగం చేసిందని దుయ్యబట్టారు. స్మశానాలను ఫోటోలు దిగే కేంద్రాలుగా అభివృద్ధి చేసినమని, పదేండ్ల అభివృద్ధిని చూసిన ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. మంచినీళ్లు, మురుగు కాల్వలు, రోడ్లు, పార్కులు, లైట్లు, మినీ ట్యాంక్ బండ్ లు, ఇలా ఎనలేని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. జూరాల వద్ద క్రాప్ హాలిడే ప్రకటించడం దుర్మార్గం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన తెలంగాణ మళ్లీ కరువులో కురుకుపోయే పరిస్థితి దాపురించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ వేశాలేసినా పట్టణ ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాంచందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.