నీలగిరి, అక్టోబర్ 14 : గర్భిణులు, బాలింతలతో పాటుగా అయిదేళ్ల లోపు చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని బోయవాడ ప్రభుత్వ పాఠశాల, మాన్యంచెల్కలోని ఉర్దు మీడియా బాలికల పాఠశాలలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ జీవన పరిణామ క్రమంలో ఆహారం పట్ల సమతుల్యత పాటించడంపై ఎవరికి తగిన అవగాహన లేకపోవడం వల్ల గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు.
గర్భిణీలు నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తహీనత, శక్తి, మాంసకృతుల లోపం, అయోడిన్, విటమిన్ ఏ, బీ లోపాలకు గురి కాకుండా ఉంటారాన్నారు. పౌష్టికాహారం లోపం వల్ల బరువు తక్కువగా ఉండటం, బలహీనంగా ఉండటం వంటి సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడం, గుండె కదలికలు, బుద్ధి మాంద్యం, మృత జననాలు, పిల్లల మరణాలు, పురిటి మరణాలు సంభవిస్తాయన్నారు. అంతకుముందు రక్త హీనతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు జయమ్మ, సరస్వతి, అంగన్వాడీ టీచర్లు గుత్తా జ్యోతి, కవిత, ప్రేమలత, స్వరుపా, అయేషా ఉమేరా, రాజేశ్వరి, భారతి, లక్షమ్మ, పద్మావతి. రమాదేవి, గర్భినీలు, బాలింతలు పాల్గొన్నారు.