తుంగతుర్తి, అక్టోబర్ 16 : పౌష్టికాహారంతోనే మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు అన్నారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం రైతు వేదికలో సీడీపీఓ శ్రీజ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల ద్వారా అందించే పదార్థాల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయన్నారు. చిరుధాన్యాలు, ఆకుకూరలతో తయారు చేసిన పోషకాహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. పోషక విలువలతో కూడిన ఆహారంపై విద్యార్థులకు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీడీపీఓ శ్రీజ మాట్లాడుతూ.. ప్రతి గర్భిణీ రక్తహీనతతో ఉండకుండా ఐరన్ ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం చిన్నారులకు అన్న ప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ దయానందం, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సూపర్వైజర్ అనురాధ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.