సూర్యాపేట టౌన్, నవంబర్ 10 : ఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఫోన్ ద్వారా జిల్లాలోని పోలీస్ అధికారులకు సూర్యాపేట ఎస్పీ నరసింహా సూచించారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు.