– నల్లగొండలో బాధితుల కేంద్రీకృత పోలీసు విధానం ప్రారంభం
కనగల్, జనవరి 22 : బాధితులు వివిధ కారణాల వల్ల పోలీస్ స్టేషన్కు వచ్చి స్వయంగా ఫిర్యాదు ఇవ్వలేని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ పౌర కేంద్రిత / బాధిత కేంద్రిత పోలీసింగ్ విధానంలో భాగంగా ప్రజల వద్దకే వెళ్లి న్యాయం అందించే వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదనపురం గ్రామానికి చెందిన బొల్లిగొర్ల గురువయ్య అనే వ్యక్తి ఇటీవల ఒక వ్యక్తి చేసిన దాడిలో గాయపడి నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది.
ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించి వెంటనే కనగల్ ఎస్ఐతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు కనగల్ పోలీసులు తక్షణమే స్పందించి బాధితుడి వద్దకు వెళ్లారు. గాయాల కారణంగా బాధితుడు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితి ఉండడంతో అక్కడే అతడికి జరిగిన అన్యాయాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుడి వాంగ్మూలాన్ని అక్కడికక్కడే నమోదు చేసి, సంఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో న్యాయం కోసం తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, అవసరమైతే పోలీసులే బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారని తెలిపారు. ముఖ్యంగా గాయపడిన వారు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు, వృద్ధులు, మహిళలు, అసహాయ వర్గాలకు బాధిత కేంద్రిత పోలీసింగ్ ద్వారా తక్షణ న్యాయం అందించడమే తెలంగాణ పోలీస్ శాఖ లక్ష్యమని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత, రక్షణ, న్యాయం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఎవరైనా అన్యాయానికి గురైతే భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.