మునుగోడు, జూలై 15: ఉన్న ఇంటిని కూతురి పేరు మీద గిప్ట్ డీడ్ చేసిన తండ్రి, తనను పట్టించుకోనందున ఆ ఇంటిని తనకు దక్కేలా చూడాలని కోరుతూ ఓ కొడుకు ఆర్డీఓ నుంచి ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని సింగారంలో చోటు చేసుకుంది. అంతేకాకుండా తనకు న్యాయం చేయాలని కోరుతూ కొడుకు శుక్రవారం నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు దిగాడు. అయితే తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం తండ్రి కూడా మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఇందుకు సంబంధించి తండ్రి చంద్రయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సింగారం గ్రామానికి చెందిన కోడి చంద్రయ్యకు కోడుకు రాములు, కూతురు అలివేలు ఉన్నారు. ఇరువురికీ పెండ్లిళ్లు అయ్యాయి. కూతురి పెండ్లి విషయంలో తన కొడుకు రాములు పట్టించుకోలేదని, ఉన్న ఆస్తితో చెల్లి పెళ్లి చేయమని చెప్పి, 2015 ఆగస్టు 27 రాత పూర్వకంగా పెద్దమనుషుల సమక్షంలో బాండ్ పేపర్ రాసి సంతకం చేశాడన్నారు. కూతురి వివాహ సమయంలో తన వద్ద డబ్బు లేకపోవడంతో పసుపు కుంకుమ కింద ఆ ఇంటిని ఆమె పేరున రిజిస్ట్రేషన్ చేయించానన్నారు.
కూతురి పెళ్లయిన తర్వాత తనను, తన భార్యను తన కొడుకు ఇంటి నుంచి వెళ్లగొట్టి, ఉన్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ ఉంటున్నాడన్నారు. ప్రస్తుతం తాము కష్టం చేసుకోలేని స్థితిలో ఉన్నందున తమ ఇంటిని, భూమిని తమకు ఇప్పించాలని ఇటీవల చండూరు ఆర్డీఓ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లామన్నారు. దీంతో ఆర్డీఓ తన కుమారునికి 14 గుంటల భూమి, తమకు ఇంటితో పాటు మిగిలిన 13 గుంట వ్యవసాయ భూమిని ఇవ్వాలని ఆర్డర్ కాపీ జారీ చేశారన్నారు.
అయినప్పటికీ తన కుమారుడు ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్‌ను ధిక్కరిస్తూ ఇల్లు ఖాళీ చేయకుండా, తమను వ్యవసాయ భూమిలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.‘కూతురికి ఇల్లు గిఫ్ట్ డీడ్ చేసి, ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా మా నాన్న ఆర్డీఓ నుంచి ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాడు. 28 సంవత్సరాలుగా ఉమ్మడిగా నివసించిన తమను పిల్లలతో సహా బయటకు పంపితే మేమెట్లా బతకాలి’ అని కొడుకు రాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.