తుంగతుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యతో ఎండిపోయిన ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు నష్ట పరిహారం (Compensation) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల పరిధిలోని సూర్య తండా బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు . బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య ( Tatikonda Seethaiah ) మాట్లాడుతూ ఎస్సారెస్పీ ( SRSP ) కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్లు అందిస్తారనే ఆశతో రైతాంగం యాసంగి నాట్లు వేశారని అన్నారు. పొలం నీళ్లు రాక ఎండి పోతుంటే రైతు గుండె గుబెల్ మంటుందని అన్నారు.
రైతు ఏడ్చినా పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగలడం ఖాయమని హెచ్చరించారు. కేసీఆర్ (KCR) ను బద్నాం చేయాలనే ఆలోచనతోనే మెడిగడ్డలో నీళ్లు ఆపకుండా అన్నారం, సుందిళ్ల ప్రాజెక్తులు నింపకుండా ఇసుక లారీలతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా మోటార్లు నడిపించి నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసవి కాలం కూడా చెరువులు నిండుగా నిండి అలుగులు పొసే పరిస్థితి ఉండేదాని తెలిపారు. ఎండిపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లకావత్ యాకూ నాయక్, మాజీ ఎంపీటీసీ మాన్సింగ్ నాయక్, శీను నాయక్, మంగు నాయక్, బిక్షం నాయక్, యాదగిరి నాయక్, వెంకన్న నాయక్, బద్దు యాదగిరి నాయక్, మహిళా రైతులు, తదితరులు పాల్గొన్నారు.