సూర్యాపేట, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియతో సాధారణ ప్రజానీకంలో సవాలక్ష సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేసేవారు లేకపోవడంతో అసలు మా ఓట్లు ఉంటాయా.. పోతాయా అంటూ జనం ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా బీఎల్వోలు సర్ ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తున్నారు. రోజువారీ కూలీలు, నిరక్ష్యరాస్యులతో పాటు సాధారణ ప్రజానీకం వాటిని ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
కాగా 2025లో ఓటేసిన వారి పేర్లను 2002 నాటి ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తారనడంతో 2025లో ఓటేసిన అనేక మంది పేర్లు 2002 జాబితాలో కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం ప్రతి 15 నుంచి 20 సంవత్సరాలకు ఒక సారి చేపడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే సర్ అమలులో అధికారులు, ఉద్యోగుల కంటే బీఎల్వోల పాత్ర కీలకంగా ఉండటం, వారికి పెద్దగా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
వీరిలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, డీలర్లు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. వీరిలో అత్యధిక మంది స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయని వారే ఉన్నారు. వీరంతా ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నప్పటికీ ఫారాలు ఎలా నింపాలో చెప్పడం లేదని, ఫారాలు ఇచ్చి వెళ్లిన తరువాత కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని పలువురు వాపోతున్నారు. తమ వద్ద ఎన్యుమరేషన్ ఫారాలు ఉన్నాయే కానీ ఎలా నింపాలో తెలియడం లేదని… ఎవరినైనా అడిగితే తెలియదంటున్నారంటున్నారు. దీంతో తమ అనుమానాలను ఎవరు నివృత్తి చేస్తారో.. ఎవరిని అడగాలో తెలియక జనం తికమక పడుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన టోల్‌ఫ్రీ నంబర్ 1950 ఉన్నా కూడా ప్రచారంలో లేదు. అలాగే ఫారాలు నింపే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే 2025 ఓటరు జాబితాలో ఉన్న పేరుతో 2002 నాటి ఓటరు జాబితాలో ఉండే పేరును మ్యాపింగ్ చేయాల్సి ఉండగా నాడు ఓటు వేసిన వారి పేర్లు 2002 ఓటరు జాబితాలో కనిపించడంలేదు. ఇటువంటి సమయంలో ఫారాలు ఇచ్చి డెడ్‌లైన్ పెట్టడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్, ప్రభుత్వం స్పందించి సరైన రీతిలో ఓటరు జాబితా సవరణ చేపట్టాలని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన ఉన్న వారితో ఫారాలు నింపేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

బీఎల్వోల సాయంతో ఫారాలు నింపేలా చర్యలు..
గరిడేపల్లి,జూలై 6 : నాకూ, నా భార్యకు బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. ఆ ఫారాలు ఎలా నింపాలో అర్థం కావడంలేదు. తప్పులు రాస్తే ఓటు పోతుందనే భయంతో ఇంత వరకు నింపలేదు. 2002 నాటి జాబితాలో తాత, తల్లిదండ్రుల పేర్లు వెతకలేకపోతున్నాం. ప్రభుత్వం బీఎల్వోల ద్వారా ఫారాలు నింపేలా చర్యలు తీసుకోవాలి. ఫారం నింపడంలో తప్పులు దొర్లితే ఓట్లు పోతాయని భయపడుతున్నాం.
-గొడుగు రామాంజి,గరిడేపల్లి
టోల్ ఫ్రీ నంబరుతో ఉపయోగం లేదు..
పెన్‌పహాడ్,జూలై 6 : బీఎల్వోలు ఇచ్చిన పారాలను ఎలా నింపాలో అర్థం కావడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. అనుమానాలు వస్తే ఎవరిని అడగాలో తెలియక అయోమయంలో ఉన్నాం. ఫారాలు ఇచ్చి చాలా రోజులవుతోంది. వాటి కోసం బీఎల్వోలు ఇంత వరకు రాలేదు. ఎవరికి ఇవ్వాలనేది కూడా తెలియడం లేదు. ఫారాలు ఇవ్వకుంటే మా ఓటు ఉంటదో.. పోతదో అర్థం కావడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన టోల్ ఫ్రీ నంబర్ 1950 పేరుకే ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతోంది కానీ ఎవరూ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. సర్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది.
-బొల్లా శ్రీనివాస్, అనంతారం