నీలగిరి, మే 23 : జిల్లాలో వైద్యాధికారుల తీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు డాక్టర్ల పని తీరు సరిగ్గా లేదని, మార్పు రాకపోతే సహించేది లేదని హెచ్చరించారు. గత డిసెంబర్ నెలలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత రాజేశ్వరి మృతి చెందిన ఘటనపై మిర్యాలగూడలోని శీరిష ఆసుపత్రిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మాతృ మరణాలపై వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దామరచర్ల మండలం జైత్రంతండాకు చెందిన ఆడావత్ రాజేశ్వరి కాన్పు కోసం మిర్యాలగూడలోని శీరిష అసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ శీరిష చివరి నిమిషం వరకు రాజేశ్వరిని ఆసుపత్రిలో ఉంచుకుని అనంతరం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారన్నారు. 28న ప్రసవం అనంతరం రాజేశ్వరి మృతి చెందిన ఘటనలో నిర్లక్ష్యం వహించిన శిరీష అసుపత్రిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. పేషెంట్ల అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా మాతృ మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్త మొదలుకుని ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ డాక్టర్లు, సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.
గర్భం దాల్చిన నుంచి ప్రసవం వరకు నిరంతరం ఏఎన్సీ చెకప్తోపాటు ఈడీడీ ప్రకారం సుఖప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యలో ఏదైనా ఆరోగ్య సమస్యతలెత్తితే పీహెచ్సీలో చికిత్స అందించాలని, అక్కడ సాధ్యం కాకపోతే ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేయాలని సూచించారు. అలాకాకుండా ప్రభుత్వ వైద్యులు అక్కడక్కడా ప్రైవేట్ దవాఖానలకు రెఫర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు వంటి కారణాల వల్ల ప్రసవం తరువాత మహిళలు మరణిస్తున్నారని, మరికొన్ని కేసుల్లో చికిత్స తీసుకోకపోవడం, పౌష్టికాహాకారంలోపం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి కేసులు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నందున అక్కడ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డా.మాతృ, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, సీడీపీఓలు, వైద్యాధికారులు, ఎంసీహెచ్ సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.