సూర్యాపేట, ఏప్రిల్ 20 : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు భారం కాదు.. మన బాధ్యత అని, ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓటు ఆవశ్యకతపై వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌తో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం కల్పించిన సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం వృద్ధులు 17,216 మంది ఉండగా.. అందులో 85సంవత్సరాల వారు 6,425 మంది ఉన్నారని తెలిపారు.
ట్రాన్స్జెంబర్స్ 55, అంగవైకల్యం ఉన్న వారు 1,321 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో గుర్తించిన కేంద్రాల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా 729 వీల్చైర్లు, ఆటో సదుపాయం, వలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు 96శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఓటు ఆవశ్యకతపై స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
పోలింగ్ రోజు 85 సంవత్సరాలు పైబడిన వారు, మంచానికి పరిమితమైన వారికి హోమ్ ఓటింగ్ సద్వినియోగం చేసుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 729 ప్రాంతాల్లో ఈ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లా ఎన్నికల అధికారి సూచనలను అనుసరించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో సీడీపీఓ కిరణ్మయి, శ్రీవాణి, శ్రీజ, రూప, సాయిగీత, సూపర్వైజర్ జగతి పాల్గొన్నారు.