సూర్యాపేట, జూన్ 5 : ఈ నెల 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ప్రియాంక, అదనపు ఎస్పీ నాగేశ్వర్రావుతో కలిసి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్స్కాడ్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 9,725 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల తరువాత ఎవరినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దన్నారు. మహిళా అభ్యర్థులు మెహందీ పెట్టుకోకపోవడమే మంచిదన్నారు.
మెహందీతో బయోమెట్రిక్‌లో ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్, తాగునీరు అందుబాటులో ఉంచాలని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్, ట్యాబ్స్, పెన్‌డ్రైవ్స్, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్లు, క్యాలిక్లేటర్లు, షూకు అనుమతి ఉండదన్నారు. పరీక్ష సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న తప్పు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హాల్‌టికెట్‌తోపాటు గుర్తింపు కార్డును తెచ్చుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ అప్పారావు, డీఈఓ అశోక్ పాల్గొన్నారు.
రామగిరి, జూన్ 5 : ఈ నెల 9న నల్లగొండ జిల్లాలో నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచందర్ సూచించారు. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బుధవారం గ్రూప్-1 పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పరీక్షకు అభ్యర్థులను ఉదయం 9 నుంచి 10గంటల వరకు మాత్రమే అనుతించాలన్నారు.
10 తర్వాత వచ్చిన అభ్యర్థులను ఎట్టి పరిస్థితిలో పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో 16,899 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతుండగా వీరి కోసం 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఒకరోజు ముందుగానే వారు పరీక్ష రాసే కేంద్రాన్ని చూసుకోవాలన్నారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు ఉంటుందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి హాల్‌టికెట్, ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను తెచ్చుకోవాలన్నారు.
చెప్పులు ధరించి రావాలని, షూతో వచ్చేవారిని అనుమతించవద్దని వెల్లడించారు. అలాగే హాల్ టికెట్‌పై టీఎస్పీఎస్సీ సూచించిన విధంగా అభ్యర్థులు ఇటీవల దిగిన పాస్ఫొటోను అంటించుకుని రావాలని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘాతోపాటు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. అనంతరం పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు ఎన్ఆర్ అందచేశారు. సమావేశంలో పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్ ఆర్సీ-1 ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, ఆర్సీ-1 ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి నాగరాజు, అన్ని పరీక్ష కేంద్రాల సీఎస్‌లు, పరిశీలకులు, సిబ్బంది పాల్గొన్నారు.