సూర్యాపేట, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం మరువలేనివని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను సమర్పించారు. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెట్టిందని, ఈ పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంపచుకోవాలని కోరారు.
మహిళా సంక్షేమానికి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సత్వర పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని 86,498 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో యూనిఫామ్ కుట్టించి అందించే ఏర్పాటు చేశామని చెప్పారు. పాఠశాలల ప్రారంభం నాటికి నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా జిల్లాలోని 565 పాఠశాలల్లో రూ.15.02 కోట్లతో విద్యుత్ సరఫరా, తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటుతోపాటు తదితరు మరమ్మతులు చేస్తారని అన్నారు.
రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ది కోసం రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ నిపుణులు, రాష్ట్ర అధికారులతో నేరుగా మాట్లాడిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీహెచ్ఎస్ సిరిపురం, బాలభవన్, శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులకు మొదటి మూడు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సీహెచ్ ప్రియాంక, బీఎస్ లత, ట్రైనీ ఎస్పీ రాజీవ్మీనా, జడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీఎఫ్ఓ సతీశ్‌కుమార్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.