సూర్యాపేట, ఏప్రిల్ 18 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం ఈవీఎంలను అసెంబ్లీ కేంద్రాలకు తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోదాములో ఈవీఎంల తరలింపు ప్రక్రియను ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు ప్రియాంక, బీఎస్ లతతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలించినట్లు తెలిపారు.
వాటిలో బ్యాలెట్ యూనిట్లు 1,500, కంట్రోల్ యూనిట్లు 1,500, వీవీ ప్యాట్లు 1,680 పంపించినట్లు చెప్పారు. ఇందులో వీవీ ప్యాట్లు 40 శాతం అదనంగా పంపించామన్నారు. అసెంబ్లీ ఏఆర్‌ఓల ఆధ్వర్యంలో బందోబస్తు నడుమ వీటిని తరలించినట్లు చెప్పారు. అసెంబ్లీ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచి రెండో ర్యాండమైజేషన్ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరాజు, తాసీల్దార్లు పాల్గొన్నారు.