నల్లగొండ : జిల్లాలోని శాలిగౌరారం మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింగిల్ విండో ద్వారా ఎరువులు తీసుకువెళ్తున్న రైతులతో జిల్లా కలెక్టర్ యూరియా, ఎరువుల పంపిణీపై మాట్లాడారు. ఎరువులు ఎంత రేటుకు అమ్ముతున్నారు, ఎరువులు సరిపడా పంపిణీ ఉందా, ఏ పంటలు వేశారు, పంటలకు ఎరువు ఏ విధంగా వినియోగిస్తున్నారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే పంట వచ్చిన తర్వాత ధాన్యం ఎక్కడ విక్రయం చేస్తున్నారనే పలు విషయాలు కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎరువుల కొరత లేదని, ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఎంఎస్పీకి విక్రయిస్తున్నట్లు తెలిపారు.
రైతులు ఎరువులు మోతాదుకు మించి వాడ వద్దని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ పాల్ సింగ్,ఎంపీడీవో రేఖల లక్ష్మయ్య, పీఏసీఎస్ సీఈవో నిమ్మల ఆంజనేయులు, జెట్పీటీసీ రనీల, ఎంపీటీసీ జోగు సైదమ్మ, మండల వ్యవసాయ అధికారి సౌమ్య శృతి, తదితరులు పాల్గొన్నారు.