నల్లగొండ, అక్టోబర్ 29 : జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఉదయాదిత్య భవన్లో మంగళవారం ఆయా అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మాస్టర్ ట్రైనర్లు అన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను మండల స్థాయిలో ఎన్యుమరేటర్లకు చెప్పి క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలని తెలిపారు. వివరాల సేకరణ అనంతరం డేటా ఎంట్రీ నిర్వహించాలన్నారు.
వానకాలం ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. టార్పాలిన్లు, తూకం యంత్రాలు, తేమకొలిచే యంత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని, ధాన్యాన్ని మిల్లులకు పంపించాలని తెలిపారు.
ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చెక్‌పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 2022-23, 2023-24 సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్‌ను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, సీపీఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సైప్లె డీఎం హరీశ్ తదితరులు పాల్గొన్నారు.