నల్లగొండ, నవంబర్ 17: ఆడబిడ్డలను సం రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘సేవ్ ద చైల్డ్’ పేరుతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న ఆడపిల్లల అక్రమ దత్తత, బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ పరీక్షలు, బాల్య దశలోనే గర్భం దాల్చటం తదితర సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ఆడబిడ్డల సంరక్షణపై పలు సూచనలు చేశారు. అలాగే గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో పంచాయతీ కార్యదర్శితో పాటు అంగన్వాడీ టీచర్, గ్రామ పాలనాధికారులను నియమించాలన్నారు.
ప్రతి గ్రామంలో ఈ కమిటీ లింగ నిర్ధారణ పరీక్షలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే వెంటనే జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రధానంగా పెద్దవూర, పీఏ పల్లి, దామరచర్ల, తిర్మలగిరి సాగర్ మండలాల్లో ఈ కమిటీలు చురుకుగా వ్యవహరిస్తూ బాలికలు, బాలుర పాఠశాలల్లో అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ ఆడపిల్లల అక్రమ దత్తత, బాల్య వివాహాలు, చిన్న వయసులోనే గర్భం దాల్చటం తదితర అం శాలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్, ఎన్జీవో అధ్యక్షుడు నాగసేనా రెడ్డి, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి, డీఈవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.