నల్లగొండ, ఫిబ్రవరి 21 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి పలు విషయాలను వివరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియోజకవర్గ వ్యాప్తంగా 200 పోలింగ్ కేంద్రాలు ఉండగా నల్లగొండలో 37 ఉన్నాయని, 50 మంది చొప్పున ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను నియమించామని తెలిపారు. వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఇన్పర్మేషన్ స్లిప్పులను 22,439 మంది ఓటర్లకు గానూ 3,358 మందికి పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 25లోపు మిగిలిన వాళ్లకు కూడా సరఫరా చేస్తామన్నారు.
ఈ ఎన్నికలకు జంబో బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నామని, నియోజకవర్గంలోని అన్ని జిల్లాల్లో బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 28వేల బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నామని తెలిపిన కలెక్టర్ ఎన్నికల నియమ నిబంధనలను అభ్యర్థులందరికీ తెలియచేసినట్లు వివరించారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో 5 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించామని, 13 రూట్లు ఏర్పాటు చేయటంతో పాటు 15 స్ట్రైకింగ్ ఫోర్స్, మూడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 29 ఫ్లయింగ్ స్కాడ్స్, 41ఎంసీసీ బృందాలను తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.