నల్లగొండ రూరల్,జూలై 9: ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక జిల్లా పేజీలో బుధవారం వెలువడిన ‘సర్కార్ స్కూల్లో సౌకర్యాలు నిల్’ కథనంపై స్పందిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం మండలంలోని ముశంపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు తాగునీటి కష్టాలు రాకుండా తక్షణమే వాటర్ ట్యాంక్‌కు కనెక్షన్ ఇప్పించాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఇంటి నుంచి వాటర్ బాటిళ్లను తెచ్చుకొని తాగడం, నల్లాలు లేకపోవడం, సంప్ హౌజ్‌పై కూర్చోని తిన్న ప్లేట్లను కడిగేందుకు నానాతంటాలు పడటం తదితర సమస్యలను విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం సైదిరెడ్డి తాగునీటి సమస్యను లెక్టర్‌కు వివరిస్తూ గతంలో ఉన్న మోటర్ పనిచేయడం లేదని, వేసవి సెలవుల్లో ట్యాప్‌లను ఎవరో ఎత్తుకెళ్లారని చెప్పారు. దీంతో కలెక్టర్ తక్షణమే పాఠశాల గ్రాంటును వినియోగించి మోటర్‌తోపాటు, వాటర్ ట్యాంక్‌కు కనెక్షన్ ఇచ్చి నీటి సరఫ రా సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా నల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కోరారు.
విద్యార్థులకు సౌకర్యాలు కల్పించే విషయం లో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల విద్యాధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను పర్యవేక్షిస్తూ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నైన్త్, టెన్త్ తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి లెక్కల సబ్జెక్టులో వారికున్న సామర్థ్యాన్ని పరిశీలించారు. ఆమె వెంట నల్లగొండ ఎంపీడీవో సిరిపురం వెంకట్‌రెడ్డి, ఎంఈవో అరుంధతి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షఫియొద్దీన్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.