నీలగిరి, జనవరి 6 : ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం – జన్మన్) కార్యక్రమం ద్వారా ఆదివాసీ, చెంచు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి సంపూర్ణ అభివృద్ధి చేయనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం పీఎం – జన్మన్ కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకాన్ని 2023 – 24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 – 26 వరకు అమలు చేయనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.24,104 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. జిల్లాలోని పెద్దవూర, చందంపేట, గుండ్లపల్లి, నేరేడుగొమ్ము మండలాల పరిధిలో నెల్లికల్, చిత్రియాల, గోనబోయినపల్లె, కంబాలపల్లి, రేకుల వలయం, పొగిళ్ల, తిమ్మాపూర్, గన్నెర్లపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని చెంచు ప్రజలకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పథకంలో పకా గృహాలు, అనుసంధాన రోడ్లు, కుళాయి నీటి సరఫరా, హాస్టళ్ల నిర్మాణం, వృత్తి విద్యా నైపుణ్యాభివృద్ధి, సంచార మెడికల్ వైద్య సేవలు, అందరికీ పోషకాహారం, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, ఉన్నత జీవన ప్రమాణాలు, మారుమూల ప్రాంతాలకు టెలిఫోన్ సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
నీలగిరి, జవనరి 6 : జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పీపీ వవా ఆదివారం నల్లగొండలో పర్యటిస్తున్నారని, జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖకు సంబంధించి సఫాయి కర్మచారిల జాతీయ కమిషన్ సభ్యులు వస్తున్నందున ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని నల్లగొండ ఆర్డీఓను ఆదేశించారు. 8న అన్ని మున్సిపాలిటీల సమావేశానికి తగిన ఏర్పాట్లు చేయాలని, దానికి సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజ్‌కుమార్, ఆర్డీఓలు రవి, చెన్నయ్య వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.