భువనగిరి కలెక్టరేట్, మే 11 : లోక్‌సభ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, డీసీపీ రాజేశ్‌చంద్రతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 2,141 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 18,08,585 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 8,98,416 మంది పురుషులు, 9,10,090 మంది మహిళలు ఉన్నారని అన్నారు.
46,665 మంది దివ్యాంగులు, 10,945 మంది 85 ఏండ్లు పైబడిన వారు, 79 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎస్ఎస్టీ, బీఎస్టీ, వీవీటీ, ఎఫ్ఎస్టీ 58 టీమ్‌లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కాకుండా పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. మొత్తం 245 మంది సెక్టార్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ఒక సెక్టార్ అధికారి 10నుంచి 12 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించామన్నారు.
1,325 ప్రాంతాల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేశామని, అంధులకు బ్రెయిలీ బ్యాలెట్ అందుబాటులో ఉంచామని తెలిపారు. సెక్టార్ ఆఫీసర్ల వద్ద కొన్ని రిజర్వ్ ఈవీఎంలను అందుబాటులో ఉంచామన్నారు. పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి భువనగిరి పట్టణంలోని ఆరోరా హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అకాడమీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎం యంత్రాలకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు 125 శాతం, వీవీ ప్యాట్లు 140 శాతం కమిషనింగ్ చేసి సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఇప్పటి వరకు 99.30 శాతం ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తయిందన్నారు.
హోమ్ ఓటింగ్‌కు సంబంధించి 1,364 మందికి గాను 1,266 మంది, పోలింగ్ విధుల్లో ఉన్న 11,193 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. ఇప్పటి వరకు 14,68,69,825 రూపాయల విలువైన బహుమతులు, నగదు, లికర్, డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి లౌడ్ స్పీకర్లపై నిషేధం ఉంటుందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థికి ఒక వాహనంతోపాటు నలుగురికి అనుమతి ఉంటుందన్నారు.
11న సాయంత్రం 5నుంచి 13న సాయంత్రం పోలింగ్ పూర్తయ్యే వరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయడం జరుగుతుందని తెలిపారు.డీసీపీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ జిల్లాలో 166 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ ఉంటుందని, మిగతా పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర పోలీసు బందోబస్తు నిర్వహిస్తాయని అన్నారు.
బయటి వారు ఉంటే పంపిస్తామని, మీడియా సిబ్బందికి పోలింగ్ కేంద్రంలో ఫొటోలు తీయడానికి అనుమతి లేదని అన్నారు. ఐదంచెల బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయని, సెక్టార్ ఆఫీసర్లు, పోలీసు బృందాలతో కూడిన టీమ్‌లు, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, ఏసీపీల స్థాయిలో స్ట్రెకింగ్ ఫోర్స్, డీసీపీ, సీపీ, ఏడీజీ స్థాయిల్లో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. పోలింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ప్రైవేటు పార్టీలకు అనుమతి లేదని తెలిపారు.