సంస్థాన్ నారాయణపురం, జూన్ 19 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అమ్మ ఆదర్శ కమిటీలు కృషి చేయాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే సూచించారు. సంస్థాన్ నారాయణపురంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలను కలెక్టర్ హనుమంతు కె.జెండగే బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో యూనిఫామ్, పుస్తకాలు అందజేసినట్లు చెప్పారు.
ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని, అందుకు సంబంధించి బడ్జెట్‌ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయంలో ధరణి సమస్యలపై ఆరా తీశారు. ఇప్పటికే తాసీల్దార్లకు ధరణి సమస్యల పరిష్కారం కోసం లాగిన్లు ఇచ్చామని, భూ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తాసీల్దార్లు కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, ఎంఈఓ నాగవర్ధన్, తాసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ ప్రమోద్కూమార్, ఏపీఓ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి నరేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : ధరణి పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే సూచించారు. బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని 5 మండలాలకు చెందిన సుమారు 400 ధరణి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. సమీక్షలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఏఓ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ సురేందర్శర్మ, వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.