భువనగిరి కలెక్టరేట్, జనవరి 12 : పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ పనులు, చౌటుప్పల్ క్లస్టర్ రూర్బన్ పనులకు సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, రోడ్లు, విద్య, వైద్యం, విద్యుత్ తదితర పూర్తికాని అభివృద్ధి పనులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకున్నారు.
జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ పనులు 747కు 410 పూర్తయ్యాయని, రూర్బన్ పనులు 11 పూర్తి కావలసి ఉన్నదని సంబంధిత అధికారులు తెలిపారు. పనులను సకాలంలో పూర్తిచేసి ఉపయోగంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, నీటిపారుదల శాఖ జిల్లా అధికారి నరసింహ, డీఈ ఖుర్షీద్, విద్యుత్ డీఈ మల్లికార్జున్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.