నల్లగొండ రూరల్, జూన్ 6 : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నదని రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. ఏజెంట్లు సంతకాలు చేసిన తరువాతే ఫలితాలు ప్రకటిస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్లా అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాత్రి 9గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిందన్నారు. మొత్తం 3,36,013 ఓట్లు పోలవగా..
అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటయ్యాయని, గెలుపు కోటా 1,55,095 ఓట్లు అని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్నకు 1,22,813, రాకేశ్‌రెడ్డికి 1,04,248, ప్రేమేందర్‌రెడ్డికి 43,313, పాలకూరి అశోక్‌కూమార్ గౌడ్‌కు 29,697 ఓట్లు వచ్చాయన్నారు. గెలుపునకు కావాల్సిన 1,55,095 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు. 52 మంది అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రారంభిస్తామన్నారు. చెల్లని ఓట్లు అధికంగా ఉండడం వల్ల కౌంటింగ్ ప్రక్రియ అలస్యమవుతందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ టీవీల్లో రికార్డు అవుతుందన్నారు.