గుర్రంపోడ్,ఫిబ్రవరి 19: బత్తాయి సాగులో రైతులు ఎదురొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషరించేందుకు కృషి చేస్తానని ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం మండలంలోని బ్రాహ్మణగూడెంలో బత్తాయి రైతు కట్టెబోయిన శ్రీనివాస యాదవ్ జీవ ఎరువులను వినియోగించి అధిక దిగుబడులు సాధించారని తెలుసుకొని ఆమె నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి రైతు శ్రీనివాసయాదవ్‌కు చెందిన బత్తాయి తోటను పరిశీలించారు.
అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. నల్గొండ జిల్లా బత్తాయి సాగుకు ప్రసిద్ధి అని, వివిధ కారణాల వల్ల ఇటీవల కాలంలో జిల్లాలో బత్తాయి సాగు పూర్తిగా తగ్గిపోయిందని, రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వారి సమస్యను పరిషరించేందుకు కృషి చేస్తానన్నారు. నాబార్డు సహకారంతో రైతు ఉత్పాదక సంస్థలను ఏర్పాటు చేసి రైతులు అధిక లాభాలు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
బత్తాయిలో జీవ ఎరువులు వాడటం వల్ల లాభాలు పెరిగే అవకాశం ఉందని శ్రీనివాస్ యాదవ్ బత్తాయి క్షేత్రాన్ని పరిశీలించిన తర్వాత అర్థమైందని, అందువల్ల రైతులు బత్తాయి సాగులో సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా వర్మి కంపోస్టు, జీవ ఎరువులు, పురుగులను నియంత్రించే మందులను వారు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆరిఫ్ ఖాన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, ఎంపీడీవో మహేశ్ తదితర అధికారులు ఉన్నారు.