గుర్రంపోడు : చెస్ ద్వారా చదువుపై ఏకాగ్రత, చురుకుదనం, దృష్టి పెరుగుతాయని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెస్ బోర్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెస్ ఒక ఆట మాత్రమే కాదని, దీని ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అన్నారు. గతంలో రాజులు ఈ ఆటను ఆడేవారని, దీని ద్వారా రాజనీతి, విజ్ఞత పెంపొందుతాయని, ఇండియాలోనే పుట్టిన ఈ ఆట ప్రస్తుతం దేశ, విదేశాల్లో ఆడుతున్నారని, ఎత్తులు పై ఎత్తులు వేసే విధానం ఈ ఆటోలో నేర్చుకోవచ్చని, దీంతోపాటు ముఖ్యంగా విద్యార్థులు ఈ ఆటను ప్రాక్టీస్ చేయడం వల్ల చదువులో కూడా ఏకాగ్రత వస్తుందని, చురుకుగా ఉంటారని అన్నారు.
భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ ఆనంద్, అర్జున్ లాంటివారు చెస్ ఆట వల్ల విశ్వవిఖ్యాతి సాధించారన్నారు. సెల్ ఫోన్ ను దూరం పెట్టి ఇలాంటి ఆటలపై దృష్టి సారిస్తే మెదడు చురుకుగా పనిచేస్తుందని, నైపుణ్యాల అభివృద్ధి చెందుతాయి అన్నారు. కోప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలను బాగా రాసి నూటికి నూరు శాతం ఉత్తీర్ణులవడమే కాకుండా 10 కి 10 జిపిఎస్ సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి బిక్షపతి, మండల విద్యాధికారి నోముల యాదగిరి, చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్, తెలంగాణ ఉద్యమకారుడు వేనేపల్లి పాండురంగారావు,చెస్ బోర్డుల దాత వేనేపల్లి అభిరామ్, సర్పంచ్ మారుపాక శంకర్, ఉపసర్పంచ్ అయితే గోని వెంకటేశం, ఉపాధ్యాయులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.