చండూరు, ఏప్రిల్ 10 : అతను కొబ్బరి బొండాలు, పండ్ల వ్యాపారి. ఆంధ్రా నుంచి కాయలు దిగుమతి చేసుకొని విక్రయించేవాడు. దూర ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడంతో ధర ఎక్కువ పడి లాభం తక్కువగా వచ్చేది. దాంతో అతను కొత్త ఆలోచన చేశాడు. వాటిని తనే పండించొచ్చు కదా.. అని ఆలోచించాడు. అనుకున్నదే తడువుగా తన భూమిలో కొబ్బరి తోట సాగు చేపట్టి ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలిచాడు చండూరుకు చెందిన జాల సైదులు. కొబ్బరి తోటల సాగు ఆంధ్రాలోనే కాదు.. తెలంగాణలోనూ పండించవచ్చని నిరూపించాడు.
చండూరు పట్టణానికి చెందిన జాల సైదులు కొంతకాలంగా స్థానికంగా కొబ్బరి బొండాలు, పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొబ్బరి బొండాలు ఆంధ్రా నుంచి తీసుకొచ్చి విక్రయించేవాడు. ఈ ప్రాంతంలో కొబ్బరి తోటలు లేకపోవడం, పక్క రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవడంతో ధర ఎక్కువ పడి లాభాలు అంతంత మాత్రంగానే వచ్చేది. ఈ క్రమంలో కొబ్బరి తోట తానెందుకు పెట్టవద్దనుకున్న సైదులు.. మిత్రులు, తెలిసిన వారిని సంప్రదించి సమాలోచన చేశాడు. మూడేండ్ల క్రితం తనకున్న 4.10 ఎకరాల భూమిలో 400 డిజే రకం కొబ్బరి మొక్కలు నాటించాడు. ఒక్కో మొక్కకు రూ.600 పెట్టి రాజమండ్రి నుంచి తెప్పించాడు. అందులో అంతర పంటగా గుమ్మడి, పుచ్చ సాగు చేశాడు. వాటి ద్వారా మూడేండ్లపాటు కొబ్బరి తోట సాగు ఖర్చులను రాబట్టాడు. నాటిన మూడేండ్లకు ఇటీవల మొదటి కాపు వచ్చింది. ట్రాలీ వాహనం కొనుగోలు చేసి తన దుకాణంలో కొబ్బరి బొండాలు విక్రయించడంతోపాటు చండూరు పరిసర గ్రామాల్లో కూడా అమ్ముతూ లాభాలు గడిస్తున్నాడు. సైదులును చూసిన మరికొంత మంది కొబ్బరి తోట సాగు చేయాలనే ఆలోచన చేస్తున్నారు.
మొదటి కాపును చూసి పట్టలేని సంతోషం
నేను కొబ్బరి తోట వేసిన మొదట్లో అందరూ కొబ్బరి సాగు ఇక్కడ పనికిరాదన్నారు. అయినా ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు సాగాను. మూడేండ్ల తర్వాత ఇటీవల మొదటి కాపు వచ్చింది. అది చూసిన నాకు పట్టలేని సంతోషం కలిగింది. అప్పుడు అనువుకాదన్న రైతులు ఇప్పుడు కొబ్బరి సాగు వైపు మళ్లుతున్నారు. మూడేండ్ల నుంచి 30 సంవత్సరాల వరకు కాపు వస్తూనే ఉంటుంది.
– జాల సైదులు, రైతు, చండూరు