కోదాడ, మే 06 : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ విశ్రాంత భవనంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలనే అమలు చేయమని కోరుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు న్యాయంగా రావాల్సిన డీఏలు, పీఆర్సీ బకాయిలు, సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు, తాము దాచుకున్న జీపీఎఫ్ బకాయిలను అడగడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
తక్షణమే జేఏసీ నేతలతో సమావేశం జరిపి సమస్యలన్నిటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ముఖ్యమంత్రి ప్రజల్లో చులకన చేసే విధంగా మాట్లాడే ధోరణిని మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, రఘువరప్రసాద్, ఖలీల్ అహ్మద్, అప్పారావు పాల్గొన్నారు.