నీలగిరి, మే 15 : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.14.66 లక్షల విలువ గల చెక్కులను గురువారం ఆయన నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు వెయ్యి కోట్ల రుపాయలను నిరుపేదల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని పార్టీలకు అతీతంగా ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, మాజీ కౌన్సిలర్ దుబ్బఅశోక్ సుందర్ పాల్గొన్నారు.