సూర్యాపేట, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి నిర్ణీత గడువులోపు సీఎంఆర్ అందించాల్సిన మిల్లులు బియ్యాన్ని ఇవ్వకుండా డిఫాల్ట్ అయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 16 డిఫాల్ట్ మిల్లులు ఉండగా.. వాటి నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలకు పైనే బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. నిబంధనల మేరకు డిఫాల్ట్ మిల్లుల నుంచి ప్రభుత్వానికి 25 శాతం అదనంగా బియ్యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. అధికార యంత్రాంగం ఎందుకు సేకరించడం లేదో.. వాటి పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదో అనేక అనుమానాలకు తావిస్తున్నది. డిఫాల్ట్ అయిన మిల్లులకు తిరిగి ధాన్యం ఇవ్వకూడదు. కానీ.. అలాంటి వారికి వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యం మళ్లీ మళ్లీ ఎలా ఇచ్చారో అర్థం కాని పరిస్థితి.
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం మిల్లులకు ఇస్తుంటుంది. ప్రతి సీజన్లో ధాన్యాన్ని మిల్లులకు ఇస్తే రా రైస్ 67 శాతం, బాయిల్డ్ రైస్ అయితే 68శాతం చొప్పున బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి గడువులోపు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మిల్లరు గడువులోపు అందించని పక్షంలో సదరు మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి డిఫాల్ట్ మిల్లుగా ముద్ర వేస్తారు. డిఫాల్ట్ మిల్లుగా రికార్డుల్లోకి ఎక్కితే సీఎంఆర్‌ను 100శాతం వసూలు చేయడంతోపాటు మరో 25 శాతం పెనాల్టీ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో 16 మిల్లులు డిఫాల్ట్‌గా ఉన్నాయి. ఈ మిల్లులు 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 తొలి సీజన్ వరకు ఈ ఏడు సీజన్లలో గడువులోపు సీఎంఆర్ పూర్తి చేయలేదు. కోట్లాది రూపాయల బకాయిలు ఉన్న డిఫాల్ట్ మిల్లుల నుంచి వసూలు కావాల్సిన పెనాల్టీ సీఎంఆర్ బియ్యం ఎప్పుడు వసూలవుతాయో.
డిఫాల్ట్ మిల్లర్లకు మళ్లీ మళ్లీ ధాన్యం..
నిబంధనల మేరకు డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వకూడదు. కానీ.. జిల్లాలో అలాంటి మిల్లులకు అధికారులు వందల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మళ్లీ మళ్లీ ఇస్తూ వచ్చారు. కొన్ని మిల్లులు రెండు, మూడు సార్లు డిఫాల్ట్ అయినప్పటికీ ధాన్యం ఎలా ఇస్తున్నారో అధికారులకే తెలియాలి. జిల్లాలో డిఫాల్ట్ అయిన 16 మిల్లుల నుంచి రావాల్సిన 25శాతం పెనాల్టీ బియ్యం విలువ దాదాపు రూ.15 కోట్లకు పైనే ఉంటుందనేది అంచనా. ప్రతి సీజన్లో ధాన్యం వస్తున్న సమయంలో తొలి, మలి విడుతలో మిల్లులకు కేటాయింపులు చేస్తూ డిఫాల్ట్ మిల్లులకు ఇవ్వమని చెప్తారు. పెద్ద మొత్తంలో మామూళ్లు తీసుకొని మూడో విడుతలో వారికి కూడా ధాన్యం కేటాయిస్తున్నారని ఓ రైస్మిల్లరే చెప్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి 25 శాతం పెనాల్టీ బియ్యాన్ని వసూలు చేయడంతోపాటు అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.