రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, దేవరకొండలో ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి పలుచోట్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 17 : తెలంగాణ రాష్ట్రం పేరు ఎత్తితే తుపాకులతో కాల్చి చంపుతామన్న వారే నేడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు సూర్యాపేట పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ తెలంగాణ పేరు ఉచ్చరించని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గెలిపించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్లు అన్ని వర్గాల ఆమోదంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసుల అండతో చేస్తున్న దుందుడుకు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చందంపేట(దేవరకొండ), సెప్టెంబర్ 17 : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని.. కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన మంగళవారం దేవరకొండలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ రేవంత్ సర్కారు ప్రజా వ్యతిరేకిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టీవీఎన్ రెడ్డి, చింతపల్లి సుభాశ్, ముక్కమల యాదయ్య, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, ముత్యాల రవి, శంకర్‌నాయక్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, తులసిరాం, ఆరెకంటి రాములు, మధు, నర్సింహ, లక్పతినాయక్, సత్తార్, ఇలియాస్ పటేల్, వాజిద్, బాబా, యాదయ్య, వెంకట్, శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.