నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్2(నమస్తే తెలంగాణ) : ఇప్పటికే వానకాలం రైతు భరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మిగిలిన వారి రుణమాఫీని అటకెక్కించేందుకూ సిద్ధమైంది. రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన తాజా ప్రకటనే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో రైతులకు 100 శాతం రుణమాఫీ పూర్తి చేశామని సీఎం చేసిన ప్రకటన రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. మూడు విడతల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో 3.39 లక్షల మందికే రుణమాఫీ జరగ్గా నాలుగో విడతలో మరికొంత మంది వివరాలు ప్రకటించారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సర్వే ప్రకారమే ఇంకో 40వేల మంది రైతులు రుణమాఫీ కోసం అర్హులైన వారు ఉన్నారు. వారి సంగతి ఏంటన్నది సీఎం ప్రకటనతో గందరగోళంలో పడింది. ఆది నుంచి ఎంత వీలైతే అంతగా రైతుల సంఖ్య తగ్గించేలా ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అందరికీ తెలిసిందే. ఇంకా కూడా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కనీసం రెండు లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదరుచూస్తున్నట్లు రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ జూలైలో రుణమాఫీని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి నిత్యం పొలాల్లో ఉండాల్సిన రైతులు అంతకుమించిన సమయాన్ని బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగడానికే వెచ్చించాల్సి వచ్చింది. అందుకు కారణం ప్రహసనంగా మారిన రుణమాఫీ ప్రక్రియనే. ప్రభుత్వం ప్రకటించిన మూడు విడతల రుణమాఫీలో ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 60 శాతానికి మించలేదు. మిగతా 40శాతానికి పైగా రైతులు రుణమాఫీ కోసం గత ఆగస్టు 15 నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మూడు నెలల నుంచి అదిగో… ఇదిగో రుణమాఫీ అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం గత నెల 30న మరికొంత మందితో నాలుగో విడత(చివరి విడతనే భావిస్తున్నారు) జాబితాలను ప్రకటించింది. ఇందులోనూ రుణమాఫీని కొద్దిమందికే పరిమితం చేశారు. గత మూడు నెలలుగా వ్యవసాయ శాఖ చేసిన సర్వేలోని వివరాల ప్రకారం రైతులను కూడా పరిగణిలోకి తీసుకోలేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడతల రుణమాఫీలో కలిపి 3.39లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది. జిల్లాలో కనీసం ఆరు లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు ఉంటారని అప్పట్లోనే రైతు సంఘాల నేతలు అంచనా వేశారు. కనీసం ఇంకో 2లక్షల నుంచి రెండున్నర లక్షల మంది రైతులు రుణమాఫీ కావాల్సిన వారు ఉంటారని పేర్కొన్నారు. రేషన్ కార్డు లేని వాళ్లు, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులకు రెండు లక్షలకు మించి రుణం ఉన్నవాళ్లు, ఆధార్, బ్యాంకు అకౌంట్, పట్టాదారు పాస్‌పుస్తకం నెంబర్లతోపాటు పేర్లు సరిపోలకపోవడం కారణాలతో వీరిని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎన్నికల హామీల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల్లోని ప్రతీ ఒక్కరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. తీరా అమలులోకి వచ్చే సరికి లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకు వీలైనన్ని సాకులను ముందుకు తెచ్చారు. దాంతో రుణమాఫీని అమలు చేస్తున్న తీరుపై రైతులు రోడ్లెక్కి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రభుత్వం పలు ఎత్తుగడలు వేసింది. రేషన్ కార్డు లేని రైతుల సర్వే ఓ వైపు తప్పులను సరిదిద్దే కార్యక్రమాన్ని మరోవైపు కొద్దికాలం చేపట్టింది. కానీ దీనికి కూడా నిర్ధిష్టమైన గడువు ఏదీ పెట్టకుండా కాలయాపన చేసింది. మూడున్నర నెలలుగా ఈ ప్రహసనం కొనసాగుతూనే వచ్చింది.
రేషన్ కార్డు సర్వే పేరుతో…
నిజానికి రుణమాఫీ కాకపోవడానికి 31 కారణాలు ఉన్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖనే గుర్తించి ప్రభుత్వానికి పంపింది. కానీ ఈ కారణాలున్న రైతుల అందరి వివరాలు సేకరించకుండా కేవలం రేషన్ కార్డు లేని వారి వివరాలు సేకరించారు. ప్రస్తుతం నాలుగో విడతలో రేషన్ కార్డు లేని వారిలో 2 లక్షల వరకు రుణాలు ఉన్న మరికొంత మందికి రుణమాఫీ జరిగినట్లుగా చేసినట్లు వ్యవసాయశాఖ చెప్తున్నది. సర్వే చేసే అప్పుడే 31 కారణాలతో మాఫీ కాని రైతుల వివరాలు సేకరించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. నల్లగొండ జిల్లానే పరిశీలిస్తే వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 44వేల మంది రైతులు రైతులు రేషన్‌కార్డు లేక రుణమాఫీకి దూరమైనట్లు తేలింది. ఇందులో ప్రస్తుతం కేవలం 21వేల మంది రైతులకు మాత్రమే తాజాగా నాలుగో విడతలో మాఫీ జరిగినట్లు తెలిసింది. మిగిలిన 23వేల మందితోపాటు ఆధార్, బ్యాంకు, పట్టాదారు పాసుపుస్తకం, లోన్ అకౌంట్ నంబర్లలో తప్పులు లేదా పేర్లు సరిపోలకపోవడం వంటి కారణాలతో మరో 16వేల మందికి రుణమాఫీ కావాల్సిన వారూ ఉన్నారు. అధికారికంగానే సుమారు 40వేల మంది ఒక్క నల్లగొండ జిల్లాలో రుణమాఫీ జరగలేదన్నది స్పష్టం. ఇక అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య కనీసం మరో 50వేల మంది ఉంటారని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు.
బ్యాంకుల చుట్టూ మళ్లీ రైతులు
తాజాగా నాలుగో విడతలో మరికొందరి పేర్లతో జాబితా విడుదల అవడంతో ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతులంతా మళ్లీ బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. ఆదివారం వ్వవసాయశాఖ జాబితా విడుదల చేస్తూ లబ్ధిదారుల పేర్లను బ్యాంకులకు పంపింది. దాంతో రైతులంతా సోమవారం వ్యవసాయ శాఖ అధికారులతో పాటు బ్యాంకులకు క్యూ కట్టారు. తమ పేర్లు ఈ జాబితాలోనైనా వచ్చాయా, లేదా? తమకు రుణమాఫీ జరిగిందా, లేదా అన్న విషయాలు తెలుసుకునేందుకు బారులు దీరారు. జాబితాలో పేర్లు లేని వారూ మరోసారి నిట్టూరుస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రేషన్ కార్డు లేని వారురూ. 2లక్షల వరకు రుణం ఉన్న వారినే ఈ సారి పరిగణలోకి తీసుకోవడంతో మిగిలిన కారణాలతో మాఫీ కాని వారు మండిపడుతున్నారు. తమకు ఎప్పుడు రుణమాఫీ అవుతుందని బ్యాంకర్లను, అధికారులను నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్‌రెడ్డి 100 శాతం రుణమాఫీ పూర్తయిందని ప్రకటించడంతో రైతుల్లో మరింత ఆగ్రహం పెల్లుబిక్కుతున్నది.