కట్టంగూర్, ఆగస్టు 26 : రాష్ట్ర రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. మంగళవారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద జరుగుతున్న ఎరువుల పంపిణీని సందర్శించి రైతులతో మాట్లాడి స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువులు వేసుకునే సమయంలో అన్నదాతలు సొసైటీ ముందు యూరియా బస్తాల కోసం రోజంతా పడిగాపులు కాసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతోనే రాష్ట్రంలో యూరియా సమస్య తలెత్తిందన్నారు. ఇచ్చిన హామీలను నేర్చవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని దద్దమ్మ పాలన చేస్తోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మంత్రులు ఒక్కోక్కరు ఒక్కోలా యూరియా కొరతపై మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు యూరియాను రైతులకు పంపిణీ చేయకుండా అధికార పార్టీ నాయకులకు దొడ్డిదారిన పంపిణీ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు సకాలంలో యూరియా అందజేశారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో పోలీసుల పహారాలో ఎరువులు పంపిణీ చేయాల్సిన దుస్ధితి నెలకొనడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా అధికారులు రైతులకు సరిపడ స్టాక్ తెప్పించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు వెంకటాద్రి, పాదూరి శిశుపాల్ రెడ్డి, మేకల రమేశ్, తండు సోమయ్య, నిమ్మనగోటి శివ, పాశం సత్తిరెడ్డి, చౌగోని శంకర్, చింతమల్ల శ్రీను, ఊటూరి నాగయ్య, పాలడుగు ఏను, బెల్లి సందీప్, రవి వెంకట్ యాదవ్ పాల్గొన్నారు.