యాదగిరిగుట్ట, నవంబర్ 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి దేవస్థానం అభివృద్ధికి నిధులేమీ మంజూరు చేయలేదు. పెండింగ్ పనుల పూర్తి, మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా సాధారణ భక్తుడిలా వెనుదిరిగారు. కేవలం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, యాదాద్రి పేరు మార్పు ప్రకటనతో సరిపెట్టారు. శుక్రవారం తన జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహచార్యుల బృందం చతుర్వేదాశీర్వచనం ఇచ్చారు. ఆలయ అనువంశికధర్మకర్త బి.నరసింహమూర్తి స్వామివారి మహాప్రసాదం, దేవదాయ, ధర్మదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ స్వామివారి పత్రిమను అందజేశారు.
అద్దాల మండపంలో స్వామివారి పులిహోర, కట్టెపొంగళి, సీరా, లడ్డూ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రెండున్నర గంటలపాటు వైటీడీఏ అధికారులతో సమీక్ష జరిపారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.20 గంటలకు సీఎం రావాల్సి ఉండగా 11.02 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుని మధ్యాహ్నం 2.50 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. సుమారుగా నాలుగు గంటలపాటు యాదగిరిగుట్టలో పర్యటించిన రేవంత్‌రెడ్డి ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులపై మాట మాత్రమైనా స్పందించకుండా పనులను వేగవంతం చేయాలని, యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాలని అధికారులను ఆదేశించి వెళ్లారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నారు.
సమీక్ష సమయంలో స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో కాంక్రీట్‌ను వినియోగించారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించగా.. వినియోగించ లేదని, బునాది నుంచే కృష్ణ శిలలతో నిర్మించామని వైటీడీఏ అధికారులు బదులిచ్చారు. దక్షిణ ప్రాంతంలో మాఢవీధుల్లో కుంగిన విషయంపై వివరణ కొరగా.. మాఢవీధులకు సంబంధించిన ఫ్లోరింగ్, ప్రాకారానికి సంబంధించి ఫ్లోరింగ్ వేరువేరుగా వేయడంతో ఈ రెండు దక్షిణ రాజగోపురం వద్ద కలుస్తాయని, రెండింటి మధ్యలో గ్యాప్ రావడంతో కొంచెం కుంగినట్లు కనిపిస్తుందని వివరించారు. దాంతో ఆలయానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో ప్రారంభమైన ఆలయ పునర్నిర్మాణ పనులను వైటీడీఏ అధికారులు ప్రొజెక్టర్ సాయంతో ఒక్కొక్క కట్టడం గురించి విడమరిచి వివరించారు.
రూ. 260 కోట్లు అవసరమైనా..
ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించిన నిధుల పెండింగ్‌లో ఉన్నాయని, రూ.100 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎంట్రీ ఫ్లై ఓవర్, దేవస్థానం బస్టాండ్, కొండ కింద గండి చెరువు సుందీకరణ, తెప్పోత్సవం పనులు పెండింగ్‌లో ఉన్నాయని, నిత్యన్నదాన సత్రం, రహదారుల విస్తరణ, పార్కింగ్ పనులు నిలిచిపోయాయని వివరించారు. గతంలో భూసేకరణ చేపట్టిన 110 ఎకరాలకు రూ. 60 కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. వాటితోపాటు మరో రూ.100 కోట్లు మంజూరు చేస్తే పనులన్నీ పూర్తి చేయొచ్చని పేర్కొన్నారు. సుమారు రెండున్నర గంటల పాటు అన్నీ విన్న రేవంత్‌రెడ్డి.. పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. కొండపైన భక్తుల నిద్రకు ఏర్పాటు చేయాలి.. బ్రహ్మోత్సవాల్లోపు విమాన గోపురం బంగారం తాపడం పనులు పూర్తి చేయాలి.. గో సంరక్షణకు ప్రత్యేక పాలసీని తీసుకురావాలని ఆదేశించారే తప్ప కనీసం తక్షణ నిధులు కింద ఒక్క రూపాయి కూడా ప్రకటించ లేదు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా గుట్ట అభివృద్ధిని పట్టించుకోకపోవడం, సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి రెండో పర్యటనలోనూ నిధులు ఇవ్వకపోవడంపై స్థానికులు, భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గంటన్నర పాటు దర్శనాలు బంద్
సీఎం పర్యటన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు సర్వ దర్శనాలను నిలిపివేయగా, భక్తులు క్యూలైన్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. కొండపైకి ఉచిత బస్సులతోపాటు ద్విచక్ర వాహనాలు, కార్లను అనుమతివ్వలేదు. దాంతో భక్తులు కొండకింద నుంచి కాలినడక వెళ్లారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టాల్సిన స్వామివారి ఆరగింపు సేవ మధ్యాహ్నం 12. 35 గంటలకు చేపట్టడం గమనార్హం.
బీఆర్ఎస్ నాయకుల నిరసన
యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక నిధుల కేటాయించని సీఎం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణంలో ఫ్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పట్టణ సీఐ రమేశ్ వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి వెళ్లిన అనంతరం తిరిగి వదిలిపెట్టారు.
కాంగ్రెస్ నేతల హంగామా
కొండపైన కాంగ్రెస్ నాయకుల ఓవర్ యాక్షన్‌ను పార్టీ కార్యక్రమాన్ని తలపించింది. తూర్పు రాజగోపురం నుంచి సీఎం, మంత్రులు ఆలయంలోకి ప్రవేశించగా.. తామూ ఆలయం లోపలికి వెళ్తామంటూ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దాదాపు 200 మందికిపైగా కొండపైకి రాగా, కొందరు క్యూలైన్‌ను తన్నుకుంటూ ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో వెనుక ఉన్న రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తోపులాటలో చిక్కుకున్నారు. ఆఖరికి ఆమెను కూడా తోసుకుంటూ ముందుకు వెళ్లారు.