‘చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలకు కాంగ్రెస్ సర్కారు అండగా ఉంటుంది. నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాం. రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నలకు కూడా మాఫీ చేస్తాం. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాం’ గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇది.
చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు.వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను సర్కారు గాలికి వదిలేసింది. గతంలో సమర్థవంతంగా అమలైన పథకాలను ఆపేసి నేతన్నల కుటుంబాలను ఆగమాగం చేస్తున్నది. చేనేత రుణాలు మాఫీ చేస్తామని గప్పాలు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత పట్టించుకోవడమే మానేశారు. ఇప్పటి వరకు మార్గదర్శకాలు కూడా విడుదల కాలేదంటేనే నేతన్నలపై సర్కారు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీ తరహాలో చేనేత రుణమాఫీకి కూడా చేసింది. 2010 నుంచి 2017 మార్చి వరకు తీసుకున్న వ్యక్తిగత రుణాలను అప్పటి ప్రభుత్వం మాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకు నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించింది. అలా జిల్లాలో 1,014 మంది చేనేత కార్మికులకు సుమారు రూ. 7కోట్ల లబ్ధి చేకూరింది. నాడు జిల్లాలోని 10 చేనేత సహకార సంఘాలకు నాబార్డ్ ద్వారా లోన్ రీ ఫైనాన్స్ కింద డీసీసీబీ నల్లగొండ నుంచి 4.52కోట్ల రుణ పరపతి మంజూరైంది. అదే విధంగా పావలా వడ్డీ పథకం కింద చేనేత సహకార సంఘాలకు 1.53 కోట్లు మంజూరు చేయడం గమనార్హం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారం, తయారీ రంగం ఉంది. సుమారు 20,000 మంది చేనేత కార్మికులు ఉంటారు. పోచంపల్లి, గట్టుప్పల్, పుట్టపాక, సంస్థాన్‌నారాయణపురం, భువనగిరి, కొయ్యలగూడెం, చండూరు, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి చీరలు అధికంగా ఉత్పత్తి చేస్తా2రు. జిల్లాలో 43 సొసైటీలు ఉండగా, వేలాది మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలోని కార్మికులు, సొసైటీలు కలిపి రూ.35.25 కోట్ల రుణాలు తీసుకున్నారు. 43 సొసైటీల్లోని 11 వాటిల్లో 52.5 కోట్లు రుణాలు తీసుకున్నాయి. 1162 మంది కార్మికులు లక్షలోపు రూ.6 కోట్లు, లక్షకు పైగా 1537 మంది 24 కోట్లు లోన్ తీసుకున్నారు. మొత్తంగా 2,689 మంది కార్మికులు 30 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు.
భూదాన్‌పోచంపల్లికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మంజూరైంది. గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘాల నాయకులు సీఎంను కలిసి రుణమాఫీపై విజ్ఞప్తి చేయగా, రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అక్కడే ప్రకటించారు. దాంతో నేతన్నల్లో ఆశలు చిగురించాయి. జిల్లా నుంచి చేనేత జౌళి శాఖ అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. నాలుగు నెలలైనా ఇప్పటి వరకు దీనిపై ఉలుకూపలుకూ లేదు.
సీఎం రేవంత్ రెడ్డి చేనేత రుణమాఫీపై ప్రకటన చేసినప్పటికీ అమలుకు సంబంధించి ఎలాం టి మందుడుగూ పడలేదు. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కాలేదు. చేనేత శాఖ అడిగిన సమాచారంలో సంఘాల వివరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగత రుణాల వివరాలు కోరలేదు. అసలు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కటాఫ్‌గా తీసుకుంటారనేది క్లారి టీ లేదు. మాఫీకి అర్హులు ఎవరు, ఎంత వరకు మాఫీ చేస్తారు అనేది తేలాల్సి ఉంది. నాడు రుణమాఫీలో రేవంత్ రెడ్డి మరమగ్గాలను ప్రస్తావించకపోవడం గందరగోళానికి దారితీసింది. ఇప్పటికే కొంతమంది కార్మికులు రుణాలు తిరిగి చెల్లించారు. వారి కి మాఫీ అవుతుందా, లేదా అనే దానిపై స్పష్టత లేదు.
చేనేత కార్మికులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాలి. మాఫీ కోసం కార్మికులంతా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి మాఫీ చేయడంతోపాటు కొత్త రుణాలు ఇప్పించాలి. కార్మికుల సంక్షేమం కోసం చేనేత పొదుపు పథకాన్ని పునరుద్ధరించాలి. చేనేత కార్మికులందరికీ పని కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి.
-చిక కృష్ణ, చేనేత నాయకుడు, భూదాన్‌పోచంపల్లి
చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అమలు చేయలేదు. పొదుపు చేసుకున్న డబ్బులను కూడా లోన్ ఉందని బ్యాంకుల్లో పట్టుకున్నరు. చేనేత రంగాన్నిపరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న కార్మికులను ఆదుకోవాలి.
– జల్ల వైకుంఠం, చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి