పెద్దఅడిశర్లపల్లి, జూలై 17 : రాష్ట్రంలో 33 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ ఏ కాలంలోనైనా పంట ఎండొద్దనే సిద్ధాంతంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అంగడిపేట రైతు వేదికలో కాంగ్రెస్ పార్టీ విద్యుత్ వ్యతిరేక నినాదానికి నిరసనగా సోమవారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ గతంలో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, ప్రస్తుతం 18వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పతి చేస్తున్నామన్నారు. అందులో 70 శాతం తెలంగాణ ఉత్పత్తి కాగా, 30 శాతం మాత్రమే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. క్లిష్ట సమయంలోనూ 20 రూపాయలకు యూనిట్ చొప్పున కొనుగోలు చేసి పంటలను కాపాడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు అందించే విద్యుత్‌పై రూ.12వేల కోట్ల రాయితీని ప్రభుత్వం భరిస్తున్నదన్నారు.
మూడు గంటల కరెంట్‌తో మూడెకరాలు పారడం సాధ్యమేనా? రైతులు ఆలోచించుకోవాలని సూచించారు. కరెంట్ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన బషీర్‌బాగ్ సంఘటనతో గత ప్రభుత్వాలు కూలిపోయాయని, మూడు గంటల కరెంట్ నినాదంతో వస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించాలని అన్నారు. పీఏపల్లి మండలంలోని పుట్టంగండి లిఫ్ట్ ఆసియా ఖండంలోనే అతి పెద్దదని, దాన్ని ఆదర్శంగా తీసుకొని పాలమూరు, కాళేశ్వరం వంటి లిఫ్ట్‌లు ఏర్పడ్డాయని చెప్పారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ లిఫ్ట్‌ల ద్వారా రెండు పంటలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. గతంలో విద్యుత్ స్లాబ్ విధానంపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్‌తోపాటు తాను వ్యతిరేకించానని చెప్పారు.
కోమటిరెడ్డికి మతిభ్రమించింది
ఎమ్మెల్యే రవీంద్రకుమార్
ఓ పక్క పీసీసీ అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్ అందిస్తామంటే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ఆందోళన చేసి ఉచిత విద్యుత్‌పై మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. అంగడిపేట, గుడిపల్లి రైతు వేదికల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలతో ఎండిన పంటలను అసెంబ్లీలో ప్రదర్శించడం, సబ్‌స్టేషన్ వద్ద రైతుల ధర్నాలు, విద్యుత్ సి బ్బందిని నిర్బంధించడం వంటి ఘటనలు ఉండేవన్నారు. నేడు అటువంటివి తెలంగాణలో ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్, కేసీఆర్ మూడు పంటలకు నీళ్లపై రైతులు గ్రామాల్లో చర్చ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత, సర్పంచ్ శీలం శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ కలమ్మ, బీఆర్ఎస్ నాయకులు మునగాల అంజిరెడ్డి, తోటకూరి పరమేశ్, పాల్వాయి రంగారెడ్డి, లచ్చిరెడ్డి, చందు, శ్రీనివాస్ పాల్గొన్నారు.