భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. పల్లె, పట్నం తేడా లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 50 వేల మందికిపైగానే జనం తరలివచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో గులాబీ జెండాలు పట్టుకొని, బైక్ ర్యాలీలు తీశారు. ఎటుచూసినా జనంతో సభ ప్రాంగణం నిండిపోయింది. ఈలలు, కేరింతలతో హోరెత్తింది. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విని చప్పట్లతో మద్దతు ప్రకటించారు.
ఆకాశాన్నంటే అభిమానం.. ఉరకలెత్తే ఉత్సాహం. మెడలో గులాబీ కండువా.. మది నిండా అభిమానం.. వాహనాల్లో మార్మోగిన తెలంగాణ పాటలు.. వెరసి భువనగిరిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. సభ సక్సెస్‌తో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు. సభ ఆసాంతం జై తెలంగాణ, జై కేసీఆర్, జై పైళ్ల శేఖర్‌రెడ్డి నినాదాలతో హోరెత్తింది. బీఆర్ఎస్ శ్రేణుల ఈలలు, కేరింతలతో సభ దద్దరిల్లిపోయింది.
– యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న భువనగిరిలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని, ఇండస్ట్రియల్ హబ్‌ను కూడా తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 98 శాతం పూర్తయ్యాయని, మరోసారి అధికారంలోకి రాగానే తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు. త్వరలోనే సాగునీటిని విడుదల చేసి లక్ష ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కొత్త జిల్లాగా ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ హయాంలో భువనగిరిలో అరాచక శక్తులు, అల్లరిమూకలతో అశాంతి ఉండేదని, వాటిని బీఆర్ఎస్ ఏరిపారేసిందని తెలిపారు. నాడు కరువుతో ఉన్న భువనగిరిలో నేడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని, యాదాద్రి భువనగిరి జిల్లా భవిష్యత్‌లో బంగారు తునక అవుతుందని చెప్పారు. మరింత అభివృద్ధి కోసం పైళ్ల శేఖర్‌రెడ్డిని మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
– యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)
సభకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. దూరంగా ఉన్న సభికులకు వేదిక కనిపించేలా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేదికపై నియోజకవర్గ ముఖ్య నేతలు ఆసీనులయ్యే అవకాశం కల్పించారు. మహిళలు, వీఐపీలు, మీడియా, వృద్ధుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ సభకు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. బహిరంగ సభకు తరలివచ్చిన జనాలను పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. సీపీ డీఎస్ చౌహన్, డీసీపీ రాజేశ్చంద్ర ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. పట్టణంలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు.
భువనగిరిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ సక్సెస్ కావడంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కృషి ఫలించింది. వారం రోజులుగా ఎమ్మెల్యే ఇక్కడే తిష్టవేసి సభ సక్సెస్ చేసేందుకు తనవంతు పాత్ర పోషించారు. సభ తేదీ ప్రకటించిన నాటి నుంచే స్థానికులతో కలిసి ఏర్పాట్లలో అన్నీ తామై పర్యవేక్షించారు. సభా స్థలం ఎంపిక నుంచి ఏర్పాట్లు, జన సమీకరణ అన్నింటిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారం రోజులుగా సభ నిర్వహణ కోసం అలుపెరుగకుండా శ్రమించారు. రోజూ ఉదయం, సాయంత్రం సభాస్థలికి వెళ్లి దగ్గరుండి పరిస్థితులను సమీక్షించారు. జన సమీకరణ కోసం ముందుగానే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మండలాలు, గ్రామాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. సభలో అసౌకర్యం కలుగకుండా చూసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు.
ప్రజా ఆశీర్వాద సభలో సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. సభకు మహిళలు బతుకమ్మలు, కోలాటాల ప్రదర్శనలతో తరలివచ్చారు. వృత్తిదారులు తమ ఆచార, సంప్రదాయాలతో కూడిన వృత్తిపరమైన పనిముట్లతో వచ్చి ఆకట్టుకున్నారు. భుజాన గొంగడి, సంకన గొర్రెపిల్లతో గొల్లకురుమలు.. వలలతో ముదిరాజ్‌లు.. కల్లు కుండలతో గీత కార్మికులు తరలివచ్చారు. ఒగ్గుడోలు, కొమ్ముడోలు కళాకారులు సంప్రదాయ పద్ధతిలో మెప్పించారు. గిరిజనులు తమ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ధూంధాం పాటలు సభికులను ఉర్రూతలూగించాయి. సింగర్ మధుప్రియ బృంధం ఆటపాటలకు అంతా ముగ్ధులయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలపై కళాకారులు పాటలు పాడుతూ అలరింపజేశారు.
ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. కాంగ్రెస్ నిర్వాకాన్ని వివరించారు. హస్తం పార్టీకి అవకాశం ఇస్తే జరిగే నష్టాన్ని విశదీకరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను తెలియజేశారు. గులాబీ అధినేత ప్రసంగం రైతులు, ప్రజలను ఆలోచింపజేసింది. 24గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో.. మూడు గంటల కాంగ్రెస్ కావాలో ఆలోచించాలన్నారు. మూడు గంటల కరెంట్‌కు గట్టి షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.