వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదు.. రైతులంతా 10 హెచ్‌పీ మోటర్లు వాడాలంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రైతాంగం భగ్గుమంటున్నది. రైతులకు వ్యతిరేకంగా అడ్డగోలుగా వాగడం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. స్వరాష్టంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంటు సరఫరాను చూసి ఓర్వలేక ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని మండి పడుతున్నది. కుట్రల కాంగ్రెస్‌కు ముకుతాడు వేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో బాధలు పెట్టిన కాంగ్రెస్ తమకు వద్దని, బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని తేల్చి చెబుతున్నది.
కాంగ్రెసోళ్లు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని అంటున్నారు. అలా ఇస్తే ఒక్క ఎకరం కూడా నీళ్లు పారే పరిస్థితి ఉండదు. గతంలో మాదిరిగానే రాత్రిళ్లు పొలం దగ్గర కాపలా కాయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో రెండు పంటలకు సరిపోను నీళ్లు అందించగలుగుతున్నాం. ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసుకుంటున్నాం. కాంగ్రెసోళ్లు అంటున్నట్లుగా 10 హెచ్‌పీ మోటర్లు అందుబాటులో లేవనే విషయాన్ని గుర్తించాలి. 24 గంటల కరెంటుతో రెండు పంటలు పండుతున్నాయి. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోరుకున్నారు కాబట్టే 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారు. రైతులను ఆగం చేసే వారు మాకు అక్కర్లేదు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది.
– పేర్ల సురేశ్, పెద్ద అడిశర్లపల్లి
రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేనట్లనిపిస్తున్నది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నడు. రైతులు 5 హెచ్‌పీ అంతకంటే తకువ మోతాదు మోటర్లు పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నరు. అలాంటి చిన్న మోటర్లకే బావుల్లో నీళ్లు సరిపోక ఒక్కోసారి మోటర్లు కాలిపోయేవి. గతంల కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని గంటలు కరెంట్ ఇస్తే నానా ఇబ్బందులు పడ్డం. ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలిసేది కాదు. కరెంటు రాగానే రైతులు మొత్తం ఒకే సారి మోటర్లు వేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. రోజుల తరబడి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కోసం తిరగాల్సి వచ్చేది.
ఇప్పుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు 10 హెచ్‌పీ మోటర్లు పెడితే కనీసం గంట కూడా నడువదు. ఎంత పెద్ద బావి అయినా సరే గంట లోపే నీళ్లన్నీ ఎత్తి పోస్తయి. పైప్‌లైన్ కూడా కనీసం మూడు నుంచి ఐదు ఇంచుల పైనే ఉండాలి. 10 మంది రైతులు ఓకేసారి మోటర్లు ఆన్ చేస్తే ఏ ట్రాన్స్ఫార్మర్ కూడా ఆగదు. నా 30 ఏండ్ల అనుభవంతో చెబుతున్న.. మూడు గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.. అది అంతా అబద్ధం. 50 మంది రైతులు ఒకసారి మోటర్ ఆన్ చేస్తే సబ్ స్టేషన్ మొత్తం కుప్పకూలి పోతది. అదే 24 గంటల కరెంటు ఉంటే ఎవరి ఇష్టం వచ్చిన సమయంలో వాళ్లు నీళ్లు పెట్టుకుంటరు. కాంగ్రెసోళ్లు చెప్పేవన్నీ అబద్ధాలే. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసేదే సరిగ్గా ఉంది.
-మోపూరి లింగారెడ్డి, రైతు, గుర్రంపోడ్
రైతులు ప్రస్తుతం 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లతో పంటలకు నీరందిస్తున్నరు. త్రీఫేజ్ కరెంటు సరఫరా కోసం అధికారులు 25, 63, 100 కేవీల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినరు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ద్వారా పన్నెండు 5 హెచ్‌పీ మోటర్లు నడిపించే అవకాశం ఉంది. ఇంతకు మించి మోటర్లు పెడితే ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పడి పేలిపోతయ్. రైతులు 5 హెచ్‌పీ ద్వారా వంద పైపులు వేసి పది ఎకరాలకు నీరు ఎంతసేపైన అందించవచ్చు. 10 హెచ్‌పీ మోటర్ల వినియోగం సాధ్యం కాదు. వీటిని రైతులు ఎక్కడా వినియోగించడం లేదు. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు 10 హెచ్‌పీ మోటర్లు పెడితే కనీసం గంట కూడా నడవయ్.
ఆ మోటర్లలోడ్ తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రేవంత్‌రెడ్డి కొనిస్తాడా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో వ్యవసాయం మంచిగా చేసుకుంటున్నాం. కష్టపడి తెచ్చుకున్న రాష్టంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో పదేండ్ల కాలంలో గతంల పడ్డ బాధలన్నీ మర్చిపోయి రైతులంతా హాయిగా వ్యవసాయం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధ్ది చెందుతున్నం. మళ్లీ ఇప్పుడు కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ చాలంటూ మాట్లాడుతున్నరు. అలాంటి బాధలు మాకొద్దు.. అలాంటి గవర్నమెంట్ వద్దు. రైతులకు 24 గంటల విద్యుత్‌ను ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వానికే రైతులమంతా అండగా ఉంటాం.
-బచ్చనమోని ఆంజనేయులు, రైతు, చింతకుంట్ల గ్రామం, కొండమల్లేపల్లి మండలం
మా లాంటి రైతులకు10 హెచ్‌పీ మోటర్లు అంటేనే తెల్వదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుండడంతో 5 హెచ్‌పీ మోటరుతో పుష్కలంగా నీళ్లు పోస్తున్నది. నీళ్లు సరిపోయినంక మేమే మోటర్లు బందు చేసుకుంటున్నం. 3 గంటల కరెంటుతో నారుమడి కూడా తడువదు. 10 హెచ్‌పీ మోటరు అసలు వ్యవసాయానికి వాడనే వాడరు. అసలు వ్యవసాయం తెలియని రేవంత్‌రెడ్డి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నడు. కాంగ్రెసోళ్ల కాలంలో కరెంటు లేక కాలం కాక వరిపొలాలు పగుళ్లు వచ్చేవి. ఇప్పుడు కరువు కాటకాలనేవే లేవు. బోర్లల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నయ్. కరెంటు కూడా సరిపోను వస్తుండటంతో ఏ చింత లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నం. వ్యవసాయం అంటే తెల్వని రేవంత్‌రెడ్డి లాంటోడికి రైతుల కష్టాలు ఏం తెలుస్తయి. కాంగ్రెస్ నాయకులకు ఓటుతోనే బుద్ది చెబుతం. మాకు సరిపోను కరెంటు, పంట పెట్టుబడి ఇచ్చే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు.
– బోయపల్లి రాములు, మర్రిగూడ
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కరెంటు కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. టార్చ్లైట్తో రాత్రిళ్లు బావుల వద్దకు వెళ్లి కరెంట్ ఎప్పుడొస్తదా అని అక్కడే పడిగాపులు కాసేవాళ్లం. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకపోయేది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. దాంతో మా బాధలు తీరాయి. ఇప్పుడు రాత్రిపూట పొలాల దగ్గరకు పోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కరెంటు సరిపడా ఇస్తుండడంతో పంటలు బాగా పండుతున్నయ్.
పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండడంతో మాకు ఆర్థికంగా కలిసి వస్తున్నది. వ్యవసాయం పండుగలా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు సాగు గురించి తెలియని రేవంత్‌రెడ్డి మూడు గంటలే చాలని చెప్పడం రైతులను అవమానించడమే. మూడు గంటల కరెంటుతో అరెకరం పొలం కూడా తడువదు.10 హెచ్‌పీ మోటర్లు ఎట్లుంటయో ఇంత వరకు మేము చూడలేదు. వీటిని కొనుక్కునే స్థితిలో కూడా రైతులు లేరు. గతంలో ఉన్న కష్టాలు, బాధలు మళ్లీ తెచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మాకొద్దు. రైతులకు మేలు చేస్తున్న కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నం.
-ఉప్పల వెంకట్‌రెడ్డి, రైతు, ఇనుపాముల, కేతేపల్లి మండలం
కాంగ్రెసోళ్ల పాలనలో కరెంటు కోసం గోస తీసాం. అర్థరాత్రి పైరు వద్ద పడిగాపులు కాశాం. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 24 గంటల కరెంటు ఇస్తుండడంతో రెండు పంటలకు నీరు పుష్కలంగా అందుతున్నది. నిత్యం కరెంటు ఉంటుండడంతో మా ఇష్టమొచ్చినప్పుడు మోటర్లు వేసుకుంటున్నం. వేసిన పంట చేతికందుతుందనే భరోసా ఉంటున్నది. సీఎం కేసీఆర్‌కు రైతుల గోస తెలుసు కాబట్టే 24 గంటల కరెంటు ఇస్తున్నడు. పంట పెట్టుబడి కూడా ఇస్తుండడంతో నాకున్న నాలుగు ఎకరాల్లో పత్తి, మిర్చి పంట సాగు చేస్తున్నాను. ఉచిత నిరంతర కరెంటుతో పుష్కలంగా నీళ్లు అందుతున్నయ్.
పంట చేతికంది చేతిలో డబ్బులు కనిపిస్తున్నయ్. హాయిగ బతుకుతున్నం. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేది. దాంతో సరిపోను నీరందక వేసిన పంటలు ఎండిపోయేవి. దాంతో అరిగోస పడ్డాం. ఆ బాధలు పోయినయ్ అనుకుంటే మళ్లీ మూడు గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నరు. అసలు కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయంపై అవగాహన ఉంటే 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోమని చెప్పరు. మళ్లీ అలాంటి బాధలు పెట్టే సర్కారు మాకొద్దు. సీఎం కేసీఆర్ లాంటి వ్యవసాయంపై అవగాహన ఉన్న వ్యక్తి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నం. అందుకే బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నం.
-కొండ్రపల్లి లాలయ్య, రైతు, గన్నెర్లపల్లి, చందంపేట
తెలంగాణ ప్రభుత్వం రాక ముందు పంటలు సాగు చేయాలంటే ఇబ్బందులు పడేటోళ్లం. నాకు మూడెకరాల భూమి ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ల కరెంట్ సరిగా లేక ఇబ్బంది పడేది. పంటలు సరిగా పండక నష్టాల పాలైనం. సీఎం కేసీఆర్ వచ్చేకే 24 గంటల కరెంటు ఇవ్వడంతో రైతుల ఇబ్బందులు తీరినై. పంటలు మంచిగ పండుతున్నయ్. పంట పెట్టుబడి కూడా ఇస్తుండడంతో పదేండ్లుగా లాభాసాటిగా వ్యవసాయం చేసుకుంటున్నం. కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంట్ చాలంటున్నరు.
10 హెచ్‌పీ మోటర్ పెడితే సాలంటున్నరు. మరి ఆ మోటర్లు కాంగ్రెసోళ్లు కొనిస్తరా.. ఎందుకంటే అంత పెద్ద మోటర్ కొనుడు రైతులతోని కాదు. 10 హెచ్‌పీ మోటర్ పెడితే మన కాడ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా పని చేయక కాలిపోతయ్. వాళ్లు వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు. అలాంటోళ్ల మాటలు నమ్మి మళ్లీ మా బతుకులు ఆగం చేసుకోం. 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే రైతులం మద్దుతు తెలుపుతున్నాం.
– ఎర్రసాని సైదులు, రైతు, మునుగోడు