ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 18న యాదగిరి గుట్టకు రానున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్,
కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి రెండు హెలికాప్టర్ల ద్వారా చేరుకోనున్నారు. అనంతరం స్వయంభూ నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు అనంతరం ఖమ్మంలో తొలిసారిగా నిర్వహించే పార్టీ బహిరంగ సభకు వెళ్తూ గుట్టను సందర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం అనంతరం ఖమ్మం బయల్దేరి వెళ్లనున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులు, పోలీసులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్ సోమవారం పరిశీలించారు.
యాదగిరిగుట్ట, జనవరి 16 : ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్ హాజరుకానున్నారు. ఇందుకోసం ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు మంగళవారం రాష్ర్టానికి రానున్నారు. రాత్రి హైదరాబాద్‌లో బస చేయనున్నారు. బుధవారం ఉదయం 11గంటలకు రెండు ప్రత్యేక హెలిక్యాప్టర్ల ద్వారా బయల్దేరి 11:30 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రూ.12కోట్లతో పూర్తి కృష్ణశిలలతో నిర్మించిన ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే వీలుంది. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణ తీరు తెన్నులను సీఎం కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. అనంతరం హెలిక్యాప్టర్ ద్వారా ఖమ్మం సభకు బయల్దేరనున్నారు.
స్వామివారికి పెరిగిన వీఐపీల తాకిడి
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా మార్చి 28న యాదాద్రి స్వయంభూ ఆలయం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా పునఃప్రారంభమైంది. అప్పటి నుంచి 10 నెలలుగా పంచనారసింహుడిని భక్తులతోపాటు వీఐపీలు ఆనందోత్సాహంతో పెద్ద సంఖ్యలో దర్శింకొని పులకించిపోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, వివిధ రాష్ర్టాల గవర్నర్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, కేంద్ర ప్రభుత్వ ప్రధాన అధికారులతోపాటు ఆర్మీ అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వస్తుండడంతో యాదగిరిగుట్ట ఆలయ విశిష్టత మరింతగా పెరుగనుంది. మూలవర్యుల పునర్దర్శనం అద్భుతంగా జరుగుతుందని భక్తులు కొనియాడుతున్నారు. ఆలయ పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ ధన్యుడయ్యారని పేర్కొంటున్నారు. గర్భాలయ ముఖమండపం ప్రహ్లాద చరిత్ర, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిలువెత్తు ఆళ్వారులతో ఆలయాన్ని సువిశాలంగా తీర్చిదిద్దారని కొనియాడుతున్నారు.

యాదగిరిగుట్టకు కేసీఆర్ 22వ సారి..
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టకు 22వ సారి రానున్నారు. మొదటిసారిగా 2014 అక్టోబర్ 17న ముఖ్యమంత్రి హోదాలో స్వామివారిని దర్శించుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ 17న రెండోసారి, 2015 ఫిబ్రవరి 27న మూడోసారి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, అనంతరం ఆలయ పనులను పరిశీలించారు. అదే ఏడాది నాలుగో సారి యాదగిరిగుట్టను సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. 2015 జూలై 5న ఐదోసారి రాష్ట్రపతితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. 2016 మార్చి 17న 6వ సారి ప్రధానాలయంలో జరిగిన తిరుకల్యాణ మహోత్సవంలో సతీసమేతంగా పాల్గొని స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
2016 అక్టోబర్ 19న ఏడోసారి ఆలయ పనులను పర్యవేక్షించారు. 2017 నవంబర్ 23న ఎనిమిదోసారి పర్యటించి పలు సూచనలు చేశారు. తొమ్మిదోసారి 2017 అక్టోబర్ 24న సందర్శించిన సీఎం కేసీఆర్ యాదగిరీశుడి పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన అన్ని హంగులు సమకూరుస్తామని పునరుద్ఘాంటించారు. 2019 ఫిబ్రవరి 3న పదోసారి యాదగిరిగుట్టకు విచ్చేసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అదే ఏడాది అగస్టు 17న 11వ సారి పర్యటించారు. 2019 డిసెంబర్ 17న 12వ సారి పర్యటించిన సీఎం పలు సూచనలు చేశారు. 2020 సెప్టెంబర్‌లో 13వ సారి యాదగిరిగుట్టను సందర్శించిన సీఎం కేసీఆర్ పనుల పురోగతిపై కీలక సూచనలు చేశారు. 2021 మార్చి 5న 14వ సారి సందర్శించి తుది మెరుగుల పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
2021 జూన్ 21న 15వ సారి వచ్చి ఆలయ పనులను సమీక్షించారు. 16వ సారి అక్టోబర్ 19న యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం కేసీఆర్ ఆలయ పునఃప్రారంభ ముహూర్తం ఖరారు చేశారు. 2022 ఫిబ్రవరి 7న 17వ సారి పునర్నిర్మాణ పనులను పరిశీలించి ఆలయ పునఃప్రారంభానికి చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. గతేడాది ఫిబ్రవరి 12న యాదగిరిగుట్టకు 18వ సారి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రెసిడెన్సియల్ సూట్‌ను ప్రారంభించారు. మార్చి 28న 19వ సారి మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభించారు. ఏప్రిల్ 25న 20వ సారి వచ్చి రామలింగేశ్వరస్వామి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని శివాలయ నూతనాలయాన్ని పునఃప్రారంభించారు. 21వ సారిగా గత ఏడాది సెప్టెంబర్ 29న యాదగిరిగుట్టకు వచ్చి స్వామివారికి స్వర్ణతాపడానికి బంగారం సమర్పించారు. తాజాగా బుధవారం 22వ సారి ఇద్దరు సీఎంలతో స్వామివారిని దర్శించుకోనున్నారు.
18న నిత్యకల్యాణం, బ్రేక్ దర్శనం నిలిపివేత
ముగ్గురు ముఖ్యమంత్రులు యాదగిరిగుట్టకు రానున్న నేపథ్యంలో బుధవారం కొండపైన నిర్వహించే శాశ్వత, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవాలతోపాటు ఉదయం 9 గంటలకు బ్రేక్ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత ఒక ప్రకటనలో తెలిపారు. నిత్య కల్యాణం
ఆంతరంగికంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
బందోబస్తుపై సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ సమీక్ష
స్వామివారిని దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్, కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, ఆలయ ఈఓ ఎన్.గీతతో కలిసి సమీక్ష నిర్వహించారు. సోమవారం యాదగిరిగుట్టకు చేరుకున్న సీపీ.. కొండ కింద హెలిప్యాడ్, ఆలయ పరిసరాలు, కొండపైన మాఢవీధులు పరిశీలించారు. ముఖ్యమంత్రుల పర్యటన ప్రశాంతంగా ముగిసేందుకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా యాదగిరిగుట్టకు చేరుకోనున్న ముఖ్యమంత్రులు కొండ కింద ఉత్తర భాగంలో గల ఎగ్జిట్ ఫ్లైఓవర్ నుంచి కొండపైకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణానికి ఆటంకం కలుగకుండా పోలీసు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. కొండపైన ముఖ్యమంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.