సూర్యాపేట, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న సూర్యాపేటకు రానున్నారు. జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, 25 కోట్ల వ్యయంతో 20 ఎకరాల్లో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం, అత్యాధునిక వసతులతో రూ.500 కోట్లతో సూర్యాపేటకే ఐకాన్‌లా సిద్ధం చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను సీఎం ప్రారంభించనున్నట్లు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు.
పాత వ్యవసాయ మార్కెట్లో నిర్మించిన ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అనంతరం సూర్యాపేటలో ఏర్పాటుచేయనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.