కష్టం తప్ప కల్మషం తెలియని మట్టిమనుషులు. బిడ్డల భవిష్యత్ బాగుండాలన్న ఆశ.. భర్త సంపాదనకు ఎంతో కొంత ఆసరా అవ్వాలన్న ఆరాటం. పొద్దు పొడవక ముందే పనికి పోతే మళ్లీ చీకటి పడ్డాకే ఇంటికి వచ్చేది. అలాంటి కష్టజీవుల మీదికి ఓ లారీ మృత్యు శకటంలా దూసుకొచ్చింది. ఆంధ్రాలోని దాచేపల్లి మండలం పొందుగుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దామరచర్ల మండలం నర్సాపురం(తండా) మహిళా కూలీలు ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున మిరపకాయలు ఏరేందుకు ఆటోలో వెళ్తుండగా ఈ జరిగిన ఆ ప్రమాదం నర్సాపురంలో తీవ్ర విషాదం నింపింది.
అలసిపోయినా, ఆలస్యమైనా ఇంటికి రాగానే ప్రేమగా పలుకరించే తల్లులు ఉలుకూపలుకూ లేకుండా పడి ఉండడం తట్టుకోలేక పిల్లలు తల్లడిల్లారు. దివ్యాంగుడై తనకు అన్నీతానై తోడున్న భార్య ఇక లేదని తెలిసిన ఒక భర్త కుప్పకూలాడు. ‘సాయంత్రం ఇద్దరం కలిసి మా తమ్ముడి పెండ్లికి పోదాం.. నువ్వు రెడీ అయ్యి ఉండయ్యా..’ అని చెప్పి వెళ్లిన భార్యను విఘతజీవిగా చూసిన భర్త రోదనలు మిన్నంటాయి. తమవాళ్ల మరణాన్ని తట్టుకోలేక ఊరుఊరంతా గుండె పగిలేలా ఏడ్చింది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5లక్షలు, క్షతగాత్రుల వైద్యానికి లక్ష రూపాయలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఓదార్చారు. తక్షణ ఖర్చులకు ఆర్ధిక సాయం అందించారు.
దామరచర్ల, మే 17 : పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన గిరిజన కుటుంబాలను రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆంధ్రాలోని దాచేపల్లి మండలం పొందుగులలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో మండలంలోని నర్సాపురం(తండా) గ్రామానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. కూలి కోసం ఆటోలో బయల్దేరిన అరగంటలోనే లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి జీవితాలను కాకా వికలం చేసింది. మృతి చెందిన మహిళల పిల్లలు అనాథలవగా వారి రోదన వర్ణనాతీతంగా ఉంది. ఒకే గ్రామానికి చెందిన వారు మృత్యువాత పడడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి.
బయల్దేరిన అరగంటలోనే
మండలంలోని నర్సాపురం(తండా) గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు కొన్ని రోజులుగా ఆంధ్రాలోని దాచేపల్లి మండలం పులిపాడులో మిరపకాయలు కోసేందుకు కూలికి వెళ్తున్నారు. బుధవారం తెల్లవారు జామున ఆటోలో 15 మంది కూలీలు ఆంధ్రాలోని పులిపాడుకు బయల్దేరారు. వాడపల్లి-పొందుగుల సరిహద్దు కృష్ణానది వంతెన దాటిన తర్వాత సింగల్ రోడ్డుపై ఆటో వెళ్తుండుగా గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆటోపైకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి అతి వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. లారీ ఆటోను ఢీకొట్టగానే ఆటో మూడు పల్టీలు కొట్టింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న నర్సాపురం(తండా)కు చెందిన ఇస్లావత్ మంజుల(26), భూక్యా పద్మ (28), మాలోతు కవిత(30), ఇస్లావత్ పార్వతి (40), భూక్యా సోని(55), వడ్త్యా సక్రి(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయలతో బయట పడ్డారు. విషయం తెలుసుకొన్న ఆంధ్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గురుజాల ఏరియా దవాఖానకు తరలించారు. చనిపోయిన ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురజాల డీఎస్సీ రాజు తెలిపారు. గురజాల దవాఖాన దామరచర్ల మండల వాసులతో నిండిపోయింది.
పనికి పోతేనే పూటగడిచేది
నర్సాపురం(తండా) గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు రోజువారీగా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. వారికి వ్యవసాయ భూములు లేక పోవడంతో భార్యాభర్తలు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వారు నిత్యం వ్యవసాయ కూలీలుగా పనులు నిర్వహిస్తుంటారు. అయితే మండలంలో వ్యవసాయ పనులు పూర్తి కావడడంతో కొన్ని రోజులుగా ఆంధ్రాకు పనికోసం వెళ్తున్నారు.
మిన్నంటిన రోదనలు
పొందుగుల వద్ద జరిగిన ప్రమాదంలో నర్సాపురం(తండా)కు చెందిన ఆరుగురు మహిళా కూలీలు మృతి చెందడంతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. వారి ఇండ్ల వద్ద బంధువులు, గ్రామస్తులు రోదనలు మిన్నంటాయి. ఉదయం కూలికి వెళ్లిన వారు ఎప్పటిలాగే సాయంత్రం తిరిగి వస్తారని అనుకుంటే ఇలా జరిగిందంటూ.. కుటుంబ సభ్యులు రోదించడం స్థానికులను కలిచివేసింది.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు గిరిజన కూలీలు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావును ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు విజ్ఞప్తి మేరకు మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
క్షతగాత్రులకు కలెక్టర్ పరామర్శ
మిర్యాలగూడ : పొందుగుల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ టి.వినయ్‌క్రిష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.
పనికి వద్దన్నా వినకుండా వెళ్లి..
ప్రమాదంలో మరణించిన భూక్యా సోని భర్త మాంజ్యా రెండేండ్ల క్రితం చనిపోయాడు. ఈమెకు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు. కుమార్తెలకు వివాహం కాగా కొడుకు వద్దనే ఉంటున్నది. వృద్ధాప్యంలో పనికి వద్దని ఎంత చెప్పినా వినకుండా వెళ్లిందంటూ కొడుకు విలపించాడు.
ఇద్దరు ఆడపిల్లలను విడిచి..
ప్రమాదంలో చనిపోయిన మాలోతు కవితకు ఇద్దరు ఆడపిల్లలు. తన ను ఒంటరి చేసి వెళ్లిపోయిందనీ కవిత భర్త కృష్ణ ఏడుస్తుంటే అక్కడి వా రంతా కన్నీరు పెట్టారు. తామిద్దరం కష్టపడి కూలీకి వెళ్తేనే కుటుంబం గడిచేదని, ఇప్పుడు తాను పిల్లలను ఎలా సాకాలంటూ రోదించాడు.
భర్తకు చేదోడుగా ఉంటూ..
వడ్త్యా సక్రి భర్త సక్రు దివ్యాంగుడు. అతను ఏపని చేయాలన్నా భార్య చేదోడు వాదోడుగా ఉండేది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి 10వ తరగతి, చిన్నమ్మాయి ఏడవ తరగతి చదువుతున్నారు. గ్రామంలో ఉన్న ఎకరంన్నర భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం పనులు లేక ఖాళీగా ఉండటంతో కూలికి వెళ్లిందని.. రోజులాగానే పోయి వస్తదనుకుంటే ఆమె మృతదేహం వచ్చిందంటూ భర్త ఏడవడం అందరి కంట తడి పెట్టించింది.
కూలి చేస్తూ..భర్తకు తోడుగా ఉంటూ..
భూక్యా పద్మకు భర్త, మూడు, ఏడు సంవత్సరాల వయసున్న ఇద్ద రు అబ్బాయిలున్నా రు. భర్త భిక్షు పీజీ పూ ర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. భార్య కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నది. ఇంతలోనే భార్య ప్రమాదంలోచనిపోవడంతో తన పిల్లలు అనాథలయ్యారంటూ భిక్షు కన్నీరుమున్నీరయ్యాడు.
కుటుంబానికి ఆసరాగా ..
ఇస్లావత్ మంజుల భర్త రంగా వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి 8, 7 ఏండ్ల బాబులతో పా టు అమ్మాయి ఉంది. భర్త డ్రైవర్‌గా, బార్య కూలీగా పనిచేసుకుం టూ పిల్లలను పోషించుకుంటున్నారు. ప్రమాదంలో మంజుల చనిపోవడంతో కుటుంబ పరిస్థితి దీనంగా మారింది.
తమ్ముడి పెండ్లికి వెళ్లాల్సి ఉండగా..
ఇస్లావత్ పార్వతి సాయంత్రం మండలంలోనే కల్లేపల్లిలో జరిగే తన తమ్ముడి వివాహానికి వెళ్లాల్సి ఉంది. తాను కూలికి వెళ్లి వచ్చినంక సాయంత్రం ఇద్దరం కలసి పెండ్లికి వెల్దామని భర్తకు చెప్పి వెళ్లింది. ఇద్దరు అమ్మాయిలకు పెండ్లి చేయడంతో ప్రస్తుతం భర్త నాగతో పాటు పార్వతి కూడా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నది. ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా షాక్‌కు గురయ్యారు.