నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్31(నమస్తే తెలంగాణ) : ‘మీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు నా కుడి భుజం లాంటోడు. ఎప్పటికప్పడు పెద్దమనిషిలా సలహాలిస్తూ, అన్ని ముఖ్యమైన మీటింగుల్లో నా వెంట ఉంటారు. ఈ విషయాలు ఆయన బయటకు చెప్పరు. భాస్కర్‌రావు లేకుండా ఏ ముఖ్యమైన మీటింగ్ కూడా జరుగదు. భాస్కర్‌రావు న్యాయంగా, ఇమాందారీగా పనిచేస్తారు. ఇంత ఉత్తమమైన భాస్కర్‌రావును లక్ష మెజార్టీతో గెలిపించండి. మిర్యాలగూడ ప్రజల కోసం ఆయన కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది. గోదావరి జలాలను పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు తరలించడం ద్వారా సాగర్ ఆయకట్టులో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు భాస్కర్‌రావు పాత్ర ఎంతో కీలకం. రానున్న రోజుల్లో అక్కడ స్థానికులకు ఉద్యోగాల కల్పిస్తాం’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మిర్యాలగూడలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు.
మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన భారీ బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలతో పాటు విపక్షాలపై పదునైనా విమర్శనాస్ర్తాలు చేస్తూ మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… ‘మీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు చాలా హుషారు… ఆయనకు ఇమాందారీగా పనిచేయడమే తెల్సు. ఇన్ని సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఆయన వ్యక్తిగత పని అంటూ నా వద్దకు రాలేదు. ఎప్పుడొచ్చినా… అది మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి లేదా మంచినీరు లేదా సాగునీటి సమస్యలే. లేదంటే మా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావాలి’ అనే వారని వివరించారు. చెక్‌డ్యామ్ కావాలి, లిఫ్ట్ కావాలని వస్తుంటే ఏకంగా మా కార్యదర్శులు… భాస్కర్‌రావు రాగానే తుంగపాడు బంధం అని గుర్తు చేసేవారంటూ చమత్కరించేవారని చెప్పారు. స్వయంగా రైతు కాబట్టి ఆయకట్టు రైతుల సమస్యలపైనే ఎప్పుడూ ధ్యాసతో ఉంటారన్నారు. ‘నేను ఇక్కడికి వస్తుంటే దారిలో ఆరున్నర కోట్లతో కట్టిన కేసీఆర్ కళాభారతిని చూపించారు. మిర్యాలగూడ మంచి కల్చరల్ సెంటర్ కాబట్టి ఎయిర్ కండిషనింగ్‌తో కట్టిన కళాభారతి బిల్డింగ్ ఆయన ఆలోచనలకు దర్పణం లాంటిది’ అని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు.
కాంగ్రెస్ కాలంలో ఎప్పుడూ ఉద్యమాలే…
‘ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఖరి, వాళ్ల ఆలోచనల గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సవ్యంగా చేసి ఉంటే మిర్యాలగూడలో చివరి కాల్వలకు నీళ్లు ఎందుకు రావు. ఎప్పుడూ ఉద్యమం ఎందుకు జరుగు… ఊకే అలజడి ఉండేది… ప్రతీసారి కాల్వ నీళ్లు వస్తయా? రావా? అనేదే ఉండేది. ప్రతి పంటకూ ఉద్యమమే ఉండేది.’ అని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ‘ఓ సందర్భంలో ఆ రోజు ఉన్నా ప్రభుత్వం నీళ్లు ఇస్తామని చెప్తే రైతులు పంటలేసిండ్రు. మధ్యలో నీళ్లాపేసిండ్రు. నా దగ్గరికి అప్పటి జిల్లా అధ్యక్షుడు తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఇక్కడి రైతుల వస్తే… రైతుందరూ నాగర్జునసాగర్ రాండి అని చెప్పిన. 60 ,70వేల మంది వచ్చారు. నేను కూడా వచ్చి నిలబడ్డ. 24 గంటల్లో నీళ్లు ఇవ్వకపోతే తూములు బద్దలు కొడ్తమని హెచ్చరించిన. తెల్లారేసరికి నీళ్లు వచ్చినై. పొలాలు పారినై.’ అంటూ అప్పటి పరిస్థితులను గుర్తు చేశారు.
గోదావరి జలాలతో శాశ్వత పరిష్కారం
ఈ ఏడాది సాగర్‌లోకి నీళ్లు రాలేదని… ఇలాంటి ఇబ్బందులు ఇక ముందు ఉండకూడదని బీఆర్ఎస్ ఆలోచిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘ఇదే విషయం భాస్కర్‌రావు గారికి చెప్పిన. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నయ్. మనం కాళేశ్వరం కట్టుకున్నం. భువనగిరి నుంచి ఆసీఫ్నహర్ కాల్వ ద్వారా నల్లగొండ దగ్గరలోని పానగల్ ఉదయ సముద్రానికి నీళ్లు వస్తాయి. ఉదయ సముద్రం నుంచి మన పెద్దదేవులపల్లి చెరువులోకి గోదావరి నీళ్లు తీసుకొని రావచ్చు. దీని ద్వారా శాశ్వతంగా సాగర్ ఆయకట్టుకు నీళ్ల బాధ తీరుంది.’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గోదావరి జలాలను ఇక్కడి తెస్తే నీళ్లకు ఇబ్బంది లేదు. ఇప్పటికే ఇట్ల నీళ్లు తెచ్చే స్కీం అంతా రెడీగా ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఈ పని పూర్తి చేస్తుందని, శాశ్వతంగా సాగర్ ఆయకట్టు రైతులకు నీళ్ల పీడ వదిలి పోతందని ప్రకటించారు. మనం ఇట్లా ఆలోచిస్తుంటే ఎంపీ ఉత్తమ్‌కూమార్‌రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నాడని, రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడని విమర్శించారు. ఇట్లాంటోళ్లకు ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెప్పాలని కోరారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుతో….
జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు పట్టుబట్టి దామరచర్లలో 30వేల కోట్లతో థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టించారని సీఎం కేసీఆర్ వివరించారు. ఇక్కడ మనకు ఉన్న కరెంటు ఉత్పత్తి కేంద్రాలన్నీ గోదావరి ఓడ్డున ఉన్నాయని, కృష్ణానది ఒడ్డున ఒక్కటీ లేదని, ఇక్కడే పెట్టాలని అందుకే ఆల్ట్రామెగా థర్మల్ ఫ్లాంట్‌ను ఇక్కడ పెట్టినట్లు వివరించారు. ఆ ప్రాజెక్టుకు భూముల విషయంలో, అనుమతుల విషయంలో భాస్కర్‌రావు తీసుకున్న చొరవ బ్రహ్మాండమని చెప్పారు. భాస్కర్‌రావు కోరిక మేరకు స్థానిక యువకులకు ఉపాధి కల్పించే బాధ్యత తనదని చెప్పారు. ‘నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా… ఈ సారి భాస్కర్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి.. తప్పకుండా వారు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తానని మనవి చేస్తున్న’ అని సీఎం ప్రకటించారు. మంచి పనుల కోసం తపించే బాస్కర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. భాస్కర్‌రావు గెలుపులోనే మిర్యాలగూడ అభివృద్ధి ఉందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించిన ప్రతిసారి సభాప్రాంగణం చప్పట్లు, ఈలలు, అరుపులు, కేరింతలతో దద్దరిల్లడం విశేషం.
సీఎం కేసీఆర్‌కు మండలి చైర్మన్ గుత్తా స్వాగతం
పట్టణంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన సీఎం కేసీఆర్‌ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పట్టణంలోని రవీంద్రనగర్‌లో హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన గుత్తా సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని పలుకరించారు.
సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు ;ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, అక్టోబర్ 31: మిర్యాలగూడలో సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసిన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంతోపాటు మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు, రైతులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ టూర్ సాగిందిలా..