సూర్యాపేట, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) ; ‘2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో నా వెంట నడిచిన మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు జగదీశ్‌రెడ్డి. ఆయన్ని జారవిడుచుకోవద్దు. రెండు సార్లు మంత్రిగా ఉంటూ భారీ పనులు చేసిన జగదీశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆయన అడుగుతున్నవే కాదు, అంతకంటే ఎక్కువే ఇస్తా. ఆయనకు మళ్లీ ఉన్నత స్థానం కల్పిస్తా’అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సూర్యాపేట, తుంగతుర్తికి నీళ్లు రాకుండా చేసిన కాంగ్రెస్‌ను బండకేసి కొట్టాలని పిలుపునిచ్చారు. సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సూర్యాపేటనే కాదు, ఈ సారి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కి 12 స్థానాలు బీఆర్ఎస్ గెలువబోతున్నదని తెలిపారు. తొమ్మిదిన్నరేండ్లలో జగదీశ్‌రెడ్డి చేసిన మంచి పనుల్లో ఒక్కటైనా గతంలో ఒక్క కాంగ్రెస్ మంత్రి అయినా చేసిండా అనేది ఆలోచించాలన్నారు. బలుపు మాటలు మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులను ఓటుతో దిమ్మె తిరిగేలా దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సభతో సూర్యాపేట జన జాతరను తలపించింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపూ భారీ స్పందన లభించింది.
‘సూర్యాపేట నుంచి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని మరోసారి గెలిపించండి.. ఆయనకు మళ్లీ ఉన్నత స్థానం ఖాయం.. మొదటి నుంచి ఉద్యమంలో నా వెంట ఉన్న మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు.. ఆయనను జారవిడుచుకోవద్దు.. రెండుసార్లు మంత్రిగా ఉంటూ భారీ పనులు చేపట్టిండు. భారీ మెజార్టీతో గెలిపించి నాకు పంపాలె’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై
ప్రసంగించారు.
ఎన్నికలు వస్తే పార్టీకో మనిషి నిలబడుతాడు. సూర్యాపేట నుంచి కూడా కొంతమంది నిలబడ్డారు. కానీ, బీఆర్ఎస్ నుంచి జగదీశ్‌రెడ్డి మూడోసారి బరిలో ఉన్నాడు. తప్పకుండా అభ్యర్థుల గుణగనాలు చూడాలి. రాష్ట్ర సాధన కోసం 15 ఏండ్లు చేసిన రాజీలేని పోరాటంలో జగదీశ్‌రెడ్డి నా సహచరుడిగా ఏ విధంగా పోరాడిండో మీకు తెలుసు. ఇది భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం లాంటి కమ్యూనిస్టులు నడిచిన గడ్డ. ఈ గడ్డపై 2014కు మందు జరిగిన దుర్మార్గుల ఆగడాలు ఎలా ఉండేదో మీరు ఆలోచన చేయాలి అని సీఎం అన్నారు.
పెన్‌పహాడ్ కాల్వలో నీటితో రైతుల్లో ఆనందం చూసినా..
నేను సూర్యాపేట నుంచి జాతీయరహదారిపై వాహనంలో వెళ్తున్నా. ఇక్కడి నుంచి కొంత దూరం పోయినంక పెన్‌పహాడ్ మండలానికి కాల్వలో నీళ్లు పోతుంటే చూసి ఆనందపడ్డాం. సూర్యాపేటకు కాళేశ్వరం, మూసీ ద్వారా నీళ్లు తెచ్చుకున్నాం. ఒకనాడు సూర్యాపేట, తుంగతుర్తిలో పంట ఎంత పండేది? ఇప్పుడు సూర్యాపేటలో 2.15లక్షల ఎకరాలు సాగవుతుందని సీఎం తెలిపారు.
మురుగు నీటికి చెక్ పెట్టింది జగదీశ్..
దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ నాయకులు మూసీ మురికి నీటిని సూర్యాపేటకు తాగునీటిగా ఇస్తే ఆ మురికి నీటి నుంచి ప్రజలకు విముక్తి కల్పించి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నది మా ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా మంత్రి జగదీశ్‌రెడ్డి కాదా? అని సీఎం అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ పెట్టి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నట్లు
గుర్తుచేశారు.
జగదీశ్‌రెడ్డి చేసిన మంచి పని ఒక్క కాంగ్రెస్ మంత్రి చేసిండా..?
ఈ జిల్లాలో మేమే సీనియర్లం, మాకు మించిన వారు లేరు అనుకునే కాంగ్రెస్ నాయకులు మంత్రులుగా చేసిండ్రు. కానీ, తొమ్మిదిన్నరేండ్లలో జగదీశ్‌రెడ్డి చేసిన మంచి పని ఒక్క కాంగ్రెస్ మంత్రి అన్న చేసిండా? అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణలో పెద్ద పవర్ ప్లాంట్ పెట్టాలని కృష్ణానది ఒడ్డున స్థలం చూసినం. రూ.30 వేల కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెడీ అవుతుందని తెలిపారు. ఈ పవర్‌ప్లాంట్‌తో జిల్లా రూపురేఖలు మారుతాయన్నారు.
రాజగోపాల్‌రెడ్డి లాంటి వారి దిమ్మతిరిగేలా దెబ్బకొట్టాలి
జిల్లాలో కాంగ్రెస్ గెలిస్తే ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కుతామని కోమటిరెడ్ది రాజగోపాల్‌రెడ్డి అంటున్నడు. అలాంటి వారి దిమ్మతిరిగేలా ఓటుతో దెబ్బ కొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డబ్బు మదం, అహంకారం, బలుపుతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నరు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో 200 పింఛన్ ఇచ్చిండ్రు. ఇవాళ మనం 5 వేలు తీసుకోబోతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
జగదీశ్ గెలిస్తే అన్నీ ఉంటాయి.. కొత్తవి వస్తాయి
సూర్యాపేటలో తొమ్మిదిన్నరేండ్లుగా మీ ముందు ఉంటూ కనీవినీ ఎరుగని రీతిలో చేసిన అభివృద్ధి పనులు కొనసాగాలన్నా, కొత్తవి రావాలన్నా ఇక్కడ భారీ మెజార్టీతో మంత్రి జగదీశ్‌రెడ్డిని గెలిపించాలి. మీ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతుండు.. ప్రజలు కట్టిన పన్నులతో రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తుండు అంటున్నడు. రైతుబంధు ఉండాల్నా? వద్దా? రైతులు చెప్పాలి అని అన్నారు. జగదీశ్‌రెడ్డి గెలిస్తే ఎకరానికి 16 వేలు ఇస్తాం అన్నారు. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో ఆముదం పంటలు తప్ప ఏమీ లేవు. ఇవాళ నేను వస్తూ చూశాను. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనిపించాయి. ఇంతకు ముందు ఏమన్నరు. మీ తెలంగానాలో వడ్లు పండవు, తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాబట్టి జొన్నలు, సజ్జలు పండించుకోవాలి, అదే మీకు బతుకు దారి అని అన్నారని సీఎం గుర్తుచేశారు.
కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని వస్తుండ్రు
ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కొట్లాడలే. మాకు నీళ్లేవి అని అడగలేదు. అడిగితే ఈ దుస్థితి ఉండేది కాదు. ఈ దద్దమ్మలు 50 ఏండ్లు మనల్ని ఎండబెట్టారు. పదేండ్లలో కరెంట్, నీరు, రైతుబందు, రైతుభీమా ఇచ్చినం. రైతులు ఆలోచించి ఓటు వేయాలి. నాడు ఏదీ చేయని కాంగ్రెస్ గద్దలు.. ఇయ్యాల ఏ ముఖం పెట్టుకొని జనం ముందుకు వచ్చి ఓట్లు అడుగుతరు అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
మల్టీప్లెక్స్‌లా ఇంటిగ్రేటెడ్ మార్కెట్..
గతంలో వచ్చినప్పుడు నేను సూర్యాపేటలో పలు ప్రారంభోత్సవాలు చేస్తూ తిరిగాను. అంతకు ముందు ఉద్యమ సమయంలో అనేక సార్లు వచ్చినా. అప్పటికీ, ఇప్పటికీ సూర్యాపేట ఎంతగా మారిపోయిందో చూస్తే జగదీశ్ పనితనం తెలుస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సూర్యాపేటలో కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ను తలపిస్తుందన్నారు. ఇక్కడ సద్దుల చెరువు, మినీ ట్యాంక్‌బండ్, మహాప్రస్థానంతోపాటు అనేక పనులు జరిగాయని చెప్పారు. గతంలో గ్రామాలు ఎలా ఉన్నాయి..? ఇవాళ ఎట్లా ఉన్నాయో బేరీజు వేసుకోవాలన్నారు. ఎవరో చెప్పిండ్రని ఓటేయొద్దని, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. సూర్యాపేటలో మంచి నాయకుడు, నిజాయితీపరుడైన జగదీశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్‌తోనే సూర్యాపేటకు రాజయోగం : మంత్రి జగదీశ్‌రెడ్డి
బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే సూర్యాపేటకు రాజయోగం వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు నేను అడిగిన ప్రతిదీ ఇచ్చారని, సూర్యాపేట జనం ఇంకా డ్రైపోర్టు, ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ టవర్లు కావాలని కోరుతున్నారని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు తెలిపారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన ఉద్యమబిడ్డ, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అంటే ఎలా ఉండాలో ప్రపంచానికి చూపించారని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తూ దేశంలో తెలంగాణను అనేక రంగాల్లో ముందుంచిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇవాల కేసీఆర్ కాలి గోటికి సరిపోని వారు.. కేసీఆర్‌ను బొందపెడుతా, చంపుతా అంటున్నారు దేనికి? ఈ దొంగల నుంచి తెలంగాణను విడిపించినందుకా..? ఈ దొంగల బారిన పడకుండా రాష్ర్టాన్ని కాపాడుతున్నందుకా..? అంబేద్కర్ కన్న కలలను నిజం చేస్తూ ఇవాళ దళితబంధును ప్రవేశపెట్టినందుకా..? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు నన్ను మీరు ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపిండ్రు. దాంతో సూర్యాపేటను జిల్లా చేసుకున్నాం.
మెడికల్ కళాశాల వచ్చింది. మురికి నీటికి విముక్తి కల్పించి కృష్ణానీళ్లు ఇచ్చినం. 50 ఏండ్లు ఎదురుచూసి బీఎన్ కలలు గన్న గోదావరి జలాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. దాదాపు రూ.7,500 కోట్లతో సూర్యాపేటలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా నడుపడంతో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. దయచేసి మళ్లీ ప్రభుత్వం వచ్చాక సూర్యాపేటలో డ్రైపోర్టును, వెయ్యి ఎకరాల్లో పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. సూర్యాపేట నాగరికతను చెప్పేలా సూర్యాపేట టూరిస్టు సర్కిల్, ఉండ్రుగొండ, పిల్లలమర్రి, పెద్దగట్టు, ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అన్నింటినీ కలుపుతూ టూరిస్టు సెంటర్‌గా చేయాలని కోరారు. సభలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ దీపికాయుగంధర్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సీనియర్ నాయకులు డాక్టర్ చెరకు సుధాకర్, వై.వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహారెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, కాసోజు శంకరమ్మ, బీరవోలు సోమిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, డాక్టర్ రామ్మూర్తి, గండూరి ప్రకాశ్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.