– పెన్పహాడ్ తాసీల్దార్ లాలూనాయక్
పెన్పహాడ్, జనవరి 29 : గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని తాసీల్దార్ లాలూ నాయక్, పెన్పహాడ్ సర్పంచ్ ఒగ్గు రవి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ క్రీడలను వారు ప్రారంభించి మాట్లాడారు. పల్లెలోని యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని, దీనివల్ల శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా లభిస్తుందన్నారు. అలాగే తాము ఎంచుకున్న క్రీడల్లో కష్టపడి రాణిస్తే పల్లె స్థాయి నుండి ప్రపంచ స్థాయి ఛాంపియన్లుగా ఎదుగొచ్చన్నారు. సీఎం కప్ క్రీడల ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికను కల్పించిందన్నారు.
ముందుగా మండల స్థాయిలో మూడు రోజులపాటు అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన జట్లను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తారు. అక్కడా ప్రతిభ చూపితే రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. గ్రామీణ క్రీడాకారులకు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు సీఎం కప్ చక్కటి వేదిక అవుతుందని కావునా సద్వినియోగం చేసుకుని సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య, ఎస్ఐ కాస్తల గోపి కృష్ణ, ఎంఈఓ నకిరేకంటి రవి, సూర్యాపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తూముల భుజంగా రావు, కార్యదర్శి నాగరాజు, ఒగ్గు కిరణ్, పీఈటీలు ప్రమీల, నాగలక్ష్మి, శ్రీను పాల్గొన్నారు.