యాదాద్రి భువనగిరి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ సర్కారు ఒక్కొక్కటిగా పాతరేస్తున్నది. ప్రజలకు ఉపయోగపడేవి.. సమర్థంగా అమలైన స్కీమ్‌లను అటకెక్కిస్తున్నది. ఇప్పటికే అనేక పథకాలను నిలిపేయగా.. తాజాగా మరో కార్యక్రమానికి మంగళం పాడే దిశగా అడుగులు వేస్తున్నది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం కోసం తీసుకొచ్చిన సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ఆపేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు ఊసేలేదు. దీంతో విద్యార్థులు మళ్లీ ఉదయం వేళ ఖాళీ కడుపులతో పాఠశాలలకు వస్తున్న పరిస్థితి దాపురించింది. అల్పాహార కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి.
గత బీఆర్ఎస్ సర్కారు విద్యను బలోపేతం చేసింది. సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించింది. టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్, రాగిజావ, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనంలాంటి అనేక కార్యక్రమాలు అమలు చేసింది. అంతేకాకుండా గతేడాది అక్టోబర్‌లో విద్యార్థుల కోసం సీఎం అల్పాహారం పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా అమలు చేసింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి స్టూడెంట్లకు అందించింది. ఈ కార్యక్రమంతో రెగ్యులర్‌గా విద్యార్థులు స్కూళ్లకు వచ్చేలా స్ఫూర్తి నింపింది. అదే విధంగా విద్యార్థుల్లో ఉన్న పోషకాహార లోప నివారణకు దోహదపడింది.
ఈ విద్యా సంవత్సరం నుంచి బంద్..
పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత వలిగొండ మండల కేంద్రం, బొమ్మల రామా రం మండలంలోని మర్యాల ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లాలోని మరో 30 పాఠశాలకు విస్తరించారు. అల్పాహారం కార్యక్రమాన్ని నిత్యం మొబైల్ యాప్, ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా పర్యవేక్షించారు. గత విద్యాసంవత్సరం పూర్తయ్యే వరకు సక్రమంగా కార్యక్రమం అమలైంది. ఈ విద్యా సంవత్సరంలో జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్కూళ్లు తెరుచుకుని నెలన్నర దాటింది. కానీ పాఠశాలల్లో మాత్రం విద్యార్థులకు ఉదయం వేళల్లో అల్పాహారం కార్యక్రమం అమలు చేయడంలేదు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మాత్రం తమకు ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే సొంతంగా డబ్బులు ఖర్చు చేసిన కాంట్రాక్టర్లు, టీచర్లకు డబ్బులు చెల్లించడం లేదు. వీరంతా బిల్లుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
బడ్జెట్లో పైసా కేటాయించలే..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా అన్ని పథకాలు, కార్యక్రమాలకు నిధులను కేటాయించింది. విద్యా శాఖకు సంబంధించిన పద్దుల్లో మాత్రం ఎక్కడా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి ఒక్క పైసా కేటాయించలేదు. బడ్జెట్ బుక్కుల్లో ఈ కార్యక్రమం గురించే ప్రస్తావించలేదు. దీంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకం మొత్తానికి బంద్ అయినట్లే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
అమలు చేసిన రోజువారీ మెనూ ఇదీ..
సోమవారం : ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ, చట్నీ
మంగళవారం : పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ
బుధవారం : ఉప్మా, సాంబార్ లేదా కిచిడీ, చట్నీ
గురువారం : మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం : ఉగ్గాని లేదా పోహా లేదా మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం : పొంగల్ లేదా సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్ లేదా ఆలు కుర్మ
ఖాళీ కడుపుతో చదువలేక పోతున్నాం
చాలా మంది విద్యార్థులు ఇంటి పరిస్థితుల రీత్యా ఉదయం పూట ఏం తినకుండా స్కూల్‌కు వస్తుండ్రు. ఈ మధ్య కొంత మంది విద్యార్థినులు ప్రేయర్ టైమ్ లో కిందపడిపోతుండ్రు. పోయిన సంవత్సరం పరీక్షల వరకు విద్యార్థులందరికీ ఉదయం పూట అల్పాహారాన్ని అందించారు. ఈ సంవత్సరం అల్పాహార పథకం లేదని బాధపడుతున్నాం. ఖాళీ కడుపుతో విద్యార్థులం చదువుల మీద శ్రద్ధ పెట్టలేక పోతున్నాం. విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికైనా అల్పాహార పథకాన్ని ప్రారంభించాలి.
– రాపోలు ఇందుప్రియ, 10 వ తగరతి విద్యార్థిని, శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వలిగొండ