– నల్లగొండ గడియారం సెంటర్లో పనిచేయని గడియారాలు
– మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై డివైఎఫ్ఐ నిరసన
రామగిరి, నవంబర్ 21 : నల్లగొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన గడియారాలు కొన్ని నెలలుగా పని చేయడం లేదు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం బంద్ చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం గడియారం సెంటర్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేశ్ మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపాలిటీకి కోట్ల ఆదాయం ఉన్నా చిన్న చిన్న పనులు కూడా చేయకుండా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. దశాబ్ధాల చరిత్ర గల గడియారం సెంటర్లో కనీసం గడియారాలు కూడా రిపేర్ చేయించలేని దుస్థితిలో మున్సిపాలిటీ అధికారులు ఉన్నారన్నారు.
నల్లగొండకి ఇదొక వారసత్వ సంపద అని, అనేక ఆందోళనలకు సజీవ సాక్ష్యం అన్నారు. సెల్ ఫోన్ అందరికీ అందుబాటులో లేని కాలంలో నల్లగొండలో అతి పెద్ద గడియారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఈ గడియారం సమయాన్ని బట్టి అనేకమంది తమ పనులకు వెళ్లేవారు. చరిత్రకు గుర్తుగా ఉన్న ఈ గడియారాలను అలంకరణగా వదిలేకుండా వెంటనే రిపేర్ చేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నలగొండ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేశ్, జిల్లా కమిటీ సభ్యులు పాలాది కార్తీక్, నాయకులు బాలరాజు, యువరాజ్, లక్ష్మణ్, రవి, మహేశ్, రాము, హరీశ్ పాల్గొన్నారు.