నీలగిరి, మార్చి 17: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వంటింటిని సైతం తాకింది. ముడి చమురు, ఎల్పీజీ సరఫరాపై ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ ధర పెరగడం, సరఫరాలో కోతలు విధించడంతో వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో హోటళ్లు మూసివేశారు. గ్యాస్ కొరత కారణంగా టిఫిన్లు, భోజనం లేదంటూ బోర్డులు పెడుతున్నారు. యుద్ధ భయంతో పాటు రంజాన్, ఉగాది పండుగలు వస్తుండటంతో జనం ముందుగానే సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో వాణిజ్య సంస్థలు వాడాల్సిన సిలిండర్ల సరఫరా అగిపోవడంతో వంటింట్లో వాడే సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రతిరోజూ సుమారు మూడు నుంచి నాలుగు వేల బుకింగ్ జరిగే ఏజెన్సీల్లో పది నుంచి పదిహేను వేల వరకు బుక్ చేసుకుంటున్నారు. జిల్లాలో యథేచ్ఛగా గృహ వినియోగ అవసరాల కోసం వాడే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతుంటే నియంత్రించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్యాస్ సెగలు రాజుకుంటున్నాయి. కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో వాణిజ్యరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదురొంటోంది. ముఖ్యంగా హోటళ్లు, హాస్ట ళ్లు, చిరువ్యాపారులు గ్యాస్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
చాలా ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్లు నిలిచిపోవడంతో గృహఅవసరాలకు వినియోగించే సిలిండర్లును వాడుతున్నారు. దీంతో వీటికి కూడా గిరాకీ పెరిగింది. దీనికి తోడు ఉగాది, రంజాన్ పండుగలు వస్తుండటంతో జనం గ్యాస్ కోసం బారులు దీరుతున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 4,84,100 డొమెస్టిక్, 1,35,562 వాణిజ్య సిలిండర్లను కలుపుకొని మొత్తం 619662 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, నెలకు సుమారు 1,89,987 బుకింగ్‌లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గ్యాస్ వృధా కాకుండా నియంత్రణలు విధిస్తూ, సరఫరాపై కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఇటీవల గృహ వినియోగ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 ధర పెంచడంతో వినియోగదారులపై భారీ మొత్తంలో భారం పడింది. ప్రస్తుతం జిల్లాలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.984.00కు చేరింది. వాణిజ్య సిలిండర్ ధర రూ. 1929 నుంచి .2045 పెరిగింది. ధరల పెరుగుదలతో వినియోగదారులపై నెలకు సుమారు రూ.1.43 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో రోజుకు 30 సిలిండర్లు సరఫరా చేసిన ఏజెన్సీలు ఇప్పుడు 12 నుంచి 14 సిలిండర్లకే పరిమితం చేస్తున్నాయి. సింగిల్ కనెక్షన్‌కు 21 రోజులు, డబుల్ కనెక్షన్‌కు 41 రోజుల తర్వాతే బుకింగ్ అనుమతిస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే సిలిండర్ బుకింగ్‌కు అవకాశం ఇస్తున్నారు.
గృహ వినియోగదారుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్యాస్ కోసం వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుకింగ్ చేసిన తర్వాత కూడా సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల డెలివరీకి సాధారణంగా ఉండే సమయానికి మించి పదిరోజుల పైనే ఆలస్యం జరుగుతోంది. గ్యాస్ ఏజెన్సీల ప్రకారం నిల్వలు తగ్గిపోవడం వల్ల సరఫరా తాతాలికంగా మందగించింది. బుకింగ్ చేసుకుని వారం రోజులుగా ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా సర్వర్ సమస్య, అన్లైన్ సమస్య అంటూ వినియోగదారులను తిప్పుతున్నారు.
వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదురొంటోంది. చిన్న హోటళ్లకు రోజుకు రెండు నుంచి మూడు సిలిండర్లు అవసరం ఉండగా, లభ్యత లేకపోవడంతో నిర్వహణ కష్టమవుతోంది. కొంతమంది యజమానులు అధిక ధరలకు గ్యాస్ కొనుగోలు చేస్తున్నా సరిపడా అందడం లేదు. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా కొంతమంది గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డెలివరీ బాయ్‌లకు అదనంగా ముట్టజెప్పి సిలిండర్లు తీసుకుంటున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడి బ్లాక్ మారెట్ పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా చాలా హోటళ్లు మెనూ తగ్గించాయి. కొన్ని మూతపడే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 50 శాతం వరకు హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లోని హోటళ్లు మళ్లీ కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు.
గ్యాస్ కొరతను సాకుగా చూపి కొందరు సిలిండర్లను బ్లాక్ మారెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్యాస్ కొరత భయంతో వినియోగదారులు పెద్ద ఎత్తున బుకింగ్ చేసుకుంటున్నారు. మరికొంత మంది దీన్ని అదునుగా తీసుకుని బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారు. గ్రామాల్లోని వినియోగారుల వద్ద ఉన్న గ్యాస్ కనెక్షన్లను తీసుకొని వాణిజ్య అవసరాలకు వాడుతున్నారు. జిల్లాలోని చాలా పట్టణాల్లో గృహఅవసరాలకు వాడే సిలిండర్లు వాణిజ్య సంస్థలు వాడుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన అధికారులు చడీచప్పుడు లేకుండా ఉన్నారు.
జిల్లాలో గ్యాస్ కొరత లేదు. అన్ని ఏజెన్సీలకు సరిపడా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా బ్లాకులో సిలిండర్లు అమ్మినా, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 6ఏ కేసులు నమోదు చేశాం. వినియోగదారులు ముందు జాగ్రత్త చర్యగా బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో చాలా ఇబ్బంది వస్తుంది. డోర్ డెలివరీ కొంత అలస్యం అవుతోందే తప్ప సరఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేవు.
– వెంకటేశ్, పౌరసరఫరాల అధికారి, నల్లగొండ