– సమగ్ర విచారణ జరిపి విధుల నుండి తొలగించాల్సిందే
– సిఐని తొలగించాలని సెప్టెంబర్ 2న పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, ఆగస్టు 31 : కోదాడ నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన సాగుతుందని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి బడుగు బలహీన వర్గాలపై పాశవికంగా వ్యవహరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ముఖ్యంగా కోదాడ పట్టణ సిఐ శివ శంకర్ నాయక్ ఓ గుండా లాగా వ్యవహరిస్తూ తన ఇష్టారాజ్యంగా బాధితులను వేధిస్తున్నాడని, తక్షణమే ఆయన దుశ్చర్యలపై సమగ్ర విచారణ చేసి విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా తమ డబ్బా కొట్టును మున్సిపల్ అధికారులు తొలగించారని ప్రధాన రహదారిపై నిరసన చేపట్టిన బాధితులు గంధం కనకమ్మ, ఆమె కుమార్తెలు, తమ్ముడు మాదాల ఉపేందర్ పై పట్టణ సీఐ దాష్టికానికి నిరసనగా సోమవారం బీఆర్ఎస్ నిర్వహించిన పట్టణ బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి దుశ్చర్యలు సహించబోమని, ఇకపై ఆయన సామాన్యులపై దౌర్జన్యానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
శివశంకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే పట్టణంలో హింస, నేరాలు, దొంగతనాలు, సెటిల్మెంట్లు పెరిగాయని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని, పోలీసుల విధులు ప్రజలకు రక్షణ కల్పించడమే తప్ప భయభ్రాంతులకు గురిచేయడం కాదన్నారు. సీఐ గతంలో ఎక్కడ విధులు నిర్వహించినా అక్కడ కూడా వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఆయన వేధింపులు తట్టుకోలేక రమావత్ రమేశ్ నాయక్ అనే గిరిజనుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య బహిరంగంగా ఆరోపించిందన్నారు. అలాగే ఇటీవల ఆగస్టు 17న హిజ్రాలు సాటి మనుషులనే గౌరవం లేకుండా వారిపై దురుసుగా ప్రవర్తించి, జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి కూడా సీఐ శివశంకర్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయన్నారు. ఐదు నెలల పసికందును తల్లి నుండి వేరు చేసి, తల్లిని నిర్బంధించడం వల్ల చిన్నారికి పాలు కూడా అందని పరిస్థితి ఏర్పడడానికి కారణం ఈయన నిర్వాకమేనన్నారు. అదేవిధంగా 150 కిలోల గంజాయి పట్టుబడిన ఘటనకు సంబంధించి కూడా పలు అనుమానాలు ఉన్నాయని, కొంతమంది వ్యక్తులతో కలిసి గంజాయి విక్రయించిన వ్యవహారంలో ఈయనపై ఆరోపణలు ఉన్నందున సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పట్టణ సీఐపై ఆరోపణలు వస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఆయనను ఎందుకు వెనుకేసుకొస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అధికార పార్టీ నేతల ఆధిపత్యం కోసం సామాన్య ప్రజలను వేధించే పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. వ్యాపారస్తులు పరస్పరం మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వచ్చి చెక్కులు రాసుకున్న సందర్భంలో కూడా ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించి కేసులు పెట్టించారనే ఆరోపణలు పట్టణ సీఐపై ఉన్నాయన్నారు.. తాను సీఐ శివశంకర్‌పై చేసిన ప్రతి ఆరోపణను ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయగానే, సోషల్ మీడియాలో పోస్టు ఫార్వర్డ్ చేశాడని ఉపేందర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి వేధించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఉపేందర్ గతంలో కౌన్సిలర్‌గా పోటీ చేసి కేవలం 16 ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తి అని, ఆయనను దొంగలా చిత్రీకరించడం దుర్మార్గం అన్నారు.
సీఐ శివశంకర్‌పై తాను పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు డీజీపీ, ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఫిర్యాదులు చేసేందుకు బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్‌కు రావాలంటేనే భయపడుతున్నాన్నారు. వ్యాపారులు, రియల్టర్లు, లిక్కర్ వ్యాపారస్తులను మామూళ్ల కోసం వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, కోదాడలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలకు కొంతమంది మధ్యవర్తుల ద్వారా నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కూడా విచారణ జరపాలని కోరారు. పట్టణ సీఐపై చర్యలు డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2న పోలీస్ స్టేషన్ ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ధర్నాకు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.